తెలంగాణలో (Telangana) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎప్పుడు పర్యటించినా అది వివాదాస్పదమవుతోంది. రాష్ట్రానికి ప్రకటించిన హామీలు, నిధుల విడుదలపై తాత్సారం, వివక్ష, తెలంగాణపై కక్ష సాధింపు చర్యలు, అభివృద్ధి పనులకు సహకరించకపోవడం వంటి వాటితో ప్రధాని మోదీపై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మోదీ ఎప్పుడు పర్యటనలు చేపట్టినా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. తాజాగా వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి (Vande Bharat Express) శనివారం తెలంగాణకు వస్తున్న మోదీపై గతంలో మాదిరే నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS Party) మోదీ పర్యటనకు వ్యతిరేకంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఇక కాంగ్రెస్ (Congress Party), కమ్యూనిస్టు పర్యటనలు మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి. మోదీ పర్యటన రోజు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మోదీకి ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తెలంగాణలోకి ప్రవేశించాలని సంచలన లేఖ (Letter) రాశారు. ఈ సందర్భంగా 30 ప్రశ్నలను మోదీకి సంధించారు.
తన 30 ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణలోకి అడుగుపెట్టాలని భట్టి విక్రమార్క మోదీకి ఆల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల ఏడాదిలో తెలంగాణకు వస్తున్న మీరు ఇప్పటివరకు ఏం చేశారని నిలదీశారు. తెలంగాణకు మీరు చేసిన ఒక్క మేలైనా చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన సందర్భంగా తెలంగాణకు చట్టంలో పేర్కొన్న హామీల్లో ఎన్ని నెరవేర్చాలని ప్రశ్నించారు. గుజరాత్ లో రూ.20 వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు కానీ తెలంగాణలోని కాజిపేటలో ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని భట్టి విక్రమార్క మోదీకి ప్రశ్నలు సంధించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కేంద్ర విద్యా సంస్థలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీటి కేటాయింపులు, పారిశ్రామిక రాయితీలు, రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై భట్టి విక్రమార్క మోదీకి ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా మద్యం కుంభకోణం విషయాన్ని ప్రస్తావించారు. వాటికి సమాధానం చెప్పి తెలంగాణలో అడుగుపెట్టాలని సవాల్ విసిరారు.
1. 2014 లో మీరు ప్రధానమంత్రి చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా?
2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ 9 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? దీనిపైన కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
3. మీ స్వంత రాష్ట్రమైన గుజరాత్లో రూ.20 వేల కోట్లతో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించిన కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? తెలంగాణ ప్రజలపట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారు?
4. బయ్యారంలో ఉక్కుకర్మాగారం పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు? దీనిపైన స్పష్టతను ఇస్తారా?
5. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయల నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారు? ఈ నిధులు 2019 నుండి నిలిపివేయడానికి కారణాలు ఏమిటి?
6. మీరు అధికారం చేపట్టిన ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు అయినా జాతీయో హోదా ఇచ్చారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అయిన పాలమూరు`రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు.
7. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఎటిఎం గా మారిందని విమర్శలు చేసే మీరు, మీ కేంద్రమంత్రులు, మీ పార్టీవారు దీనిపైన సిబిఐ లేదా ఇతర సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదు? మీకు కేసీఆర్‌కు, బిజెపికి, బీఆర్ఎస్కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటి?
8. కేంద్రమంత్రిగా శ్రీ కేసీఆర్‌గారు పనిచేసినప్పుడు పాల్పడిన సహారా, ఇ.ఎస్.ఐ స్కామ్‌లపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఈ స్కామ్‌లపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?
9. 2014 లో మీరు ప్రధానమంత్రి అయినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటీ కూడా కొత్త విద్యాసంస్థలను తెలంగాణలో ఎందుకు నెలకొల్పలేదు? ముఖ్యంగా ఐ.ఐ.ఎం, ఐ.ఎస్.ఆర్, ఎన్.ఐ.డి, ట్రిపుల్ ఐటి, నవోదయ విద్యాలయాలు కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు?
10. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు? బిజెపి పాలిత రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు? దీనిపైన మీ సమాధానం ఏమిటి?
11. తెలంగాణ రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటా కేటాయింపుల విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం తాత్సరం చేస్తోంది? సాగునీటి వాటాల కేటాయింపులపై ట్రిబ్యునల్లకు ఎందుకు రిఫర్ చేయడం లేదు?
12. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన నిధులను కూడా ఏవో సాకులు చెప్పి ఎందుకు నిలిపివేస్తున్నారు?
13. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంత సహాయం అందించారు? తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారు?
14. తెలంగాణ రాష్ట్రానికి ఈ 9 ఏళ్ల కాలంలో జాతీయ స్థాయి ఉన్న ఒక్క విద్యాసంస్థ కానీ, వైద్య కళాశాలలు కానీ మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారా?
15. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయంను ఎప్పుడు ప్రారంభిస్తారు?
16. తెలంగాణలో అనేక డిఫెన్స్ సంస్థలు ఉన్నాయి? ఈ రాష్ట్రంలో డిఫెన్స్ క్యారిడార్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదు?
17. నిజామాబాద్ పసుపు బోర్డు ఎప్పటి లోగా ఏర్పాటు చేస్తారు?
18. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధమున్న మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదు? మీకు, కేసీఆర్‌కు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందా?