కర్ణాటకలో సామాన్య ప్రజలపై భారం పడనుంది. త్వరలో రాష్ట్రంలో బస్సు ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ తెలిపారు.
Karnataka: కర్ణాటకలో సామాన్య ప్రజలపై భారం పడనుంది. త్వరలో రాష్ట్రంలో బస్సు ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ తెలిపారు. బస్సు ఛార్జీలను 15-20 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన బోర్డు సమావేశంలో బస్సు ఛార్జీలను పెంచాలని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. కేఎస్ఆర్టీసీ మనుగడ సాధించాలంటే, ఛార్జీల పెంపు తప్పనిసరని శ్రీనివాస్ తెలిపారు. ఇంధన, బస్సుల విడి పరికరాల ధరలు పెరిగాయని తెలిపారు. 2019 నుంచి రాష్ట్రంలో ఛార్జీల పెంపు లేదని, అదేవిధంగా కేఎస్ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ కూడా 2020 నుంచి జరగలేదని, కాబట్టి టికెట్ ధరలను పెంచడం అవసరమని తెలిపారు.
గత మూడు నెలల కాలంలో కార్పొరేషన్‌కు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల మోత మోగిస్తుంది. వివిధ రకాల పన్నులు, ఇతర రూపాల్లో సామాన్యుడి జేబును ఖాళీ చేస్తుంది. గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్‌ను దాదాపు 4 శాతం చొప్పున పెంచింది. దీంతో లీటర్ పెట్రోల ధర రూ.3, లీటర్ డీజిల్ ధర రూ.3.02 పెరిగింది. మరోవైపు పాల ధరలను కూడా లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై రూ.2 చొప్పున కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పెంచింది.