నిజమే మీరు చదువుతున్నది. ఓ అమ్మాయి సెల్ ఫోన్ (Cell Phone)ను మింగేసింది. ఆ ఫోన్ మింగిన (Mobile Swallow) అనంతరం ఆమె తీవ్రంగా అస్వస్థతకు గురయ్యింది. వాంతులు చేసుకోవడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా ఆమె కడుపులో (Stomach) సెల్ ఫోన్ కనిపించింది. వైద్యులు నివ్వెరపోయారు. వివరాలు అడిగితే జరిగిన విషయాన్ని యువతి చెప్పింది. వైద్యులు (Doctors) అతికష్టంతో ఆమె కడుపులో నుంచి సెల్ ఫోన్ ను తీసేశారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
బిండ్ జిల్లాకు (Bhind District) చెందిన అను (18). మార్చి 31వ తేదీన ఇంట్లో తన సోదరుడితో గొడవ పడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తన సోదరుడితో గొడవ కారణంగా అను మనస్తాపం చెందింది. ఈ సమయంలో అదే కోపంలో అకస్మాత్తుగా చైనా కంపెనీకి చెందిన సెల్ ఫోన్ ను అమాంతం నోట్లో వేసుకుని మింగేసింది. ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులు పడింది. వెంటనే కుటుంబసభ్యులు గ్వాలియర్ (Gwalior)లోని జయ ఆరోగ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం ఎక్స్ రే (X Ray), సీటీ స్కాన్ (CT Scan) చేయించారు. ప్రశాంత్ శ్రీవాత్సవ, డాక్టర్ ప్రశాంత్ పిపరియా, సర్జన్ డాక్టర్ నవీన్ కుష్వాహ్ నేతృత్వంతో కూడిన వైద్య బృందం రెండు గంటల పాటు కష్టపడి సెల్ ఫోన్ ను అను కడుపులోంచి తీసివేశారు. సర్జరీ చేయడంతో ఆమెకు పది కుట్లు పడ్డాయి.
‘శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయ్యింది. ఫోన్ ను కడుపులో నుంచి తీసివేశాం. పది కుట్లు పడ్డాయి. అను ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం. నా 20 ఏళ్ల కెరీర్ లో ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. చాలా చాలెంజింగ్ గా తీసుకుని చికిత్స అందించాం’ అని సర్జన్ డాక్టర్ నవీన్ కుష్వాహ్ (Dr Naveen Kushwah) తెలిపాడు. కాగా శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి తమ పాప ప్రాణాలు కాపాడిన వైద్యులకు యువతి కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అయితే తన సోదరుడితో యువతి ఎందుకు గొడవ పడిందో అనే విషయం తెలియలేదు.