»Kanti Velugu Creates Record Tests Crossed One Crore Mark
Telangana ప్రజలకు కోటి వెలుగులు.. రికార్డు సృష్టించిన ‘కంటి వెలుగు’
1500 మంది బృందాలు కష్టపడి పని చేశారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులు కంటి వెలుగు పరీక్షలు చేసుకున్నారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో పరీక్షలు జరిగాయి.
తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు (Kanti Velugu) కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ కార్యక్రమంలో పరీక్షలు (Tests) రికార్డు మేర జరిగాయి. కేవలం 50 రోజుల్లోనే ఏకంగా కోటి పరీక్షలు (One Crore) నిర్వహించడం విశేషం. జనవరి 18వ తేదీన మొదలైన కంటి వెలుగు రెండో దశ (Second Phase) నిర్విరామంగా కొనసాగడంపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా (SangaReddy District) సదాశివపేటలో (Sadasivpet) కంటి వెలుగు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెలూన్లను గాల్లో వదిలేశారు. వైద్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కోటి కంటి పరీక్షలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు చాలా గొప్ప రోజు. కంటి వెలుగు ద్వారా 29 లక్షల మందికి కళ్లద్దాలు అందజేశాం. ప్రజల ఇబ్బందులను గమనించి, కంటి బాధల నుంచి విముక్తి కల్పించేందుకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం తీసుకొచ్చారు’ అని తెలిపారు.
‘కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదు. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని కొన్ని రాష్ట్రాలు పరిశీలించాయి. కొన్ని రాష్ట్రాల్లో కంటి వెలుగు లాంటి కార్యక్రమం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 1500 మంది బృందాలు కష్టపడి పని చేశారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులు కంటి వెలుగు పరీక్షలు చేసుకున్నారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో పరీక్షలు జరిగాయి. 55 శాతం గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయి. కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి 16.50 లక్షల మందికి, 12.50 లక్షల మందికి కంటి అద్దాలు అందించారు’ అని హరీశ్ రావు వెల్లడించారు.