»Kondagattu Temple Burglary Three Thief Arrested In Bidar
Kondagattu దొరికిన కొండగట్టు దొంగలు.. సొత్తు స్వాధీనం
దొంగతనం ఘటనతో ప్రస్తుతం ఆలయ అభివృద్ధిపై కొంత వెనుకడుగు పడినట్లు తెలుస్తున్నది. ప్రసిద్ధ ఆలయంలో చోరీకి గురవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకున్నారు.
తెలంగాణ (Telangana)లో సుప్రసిద్ధ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం (Kondagattu Anjaneya Swamy Temple). ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrasekhar Rao) సమీక్షించి వెళ్లిన కొన్ని రోజులకే ఆలయంలో దొంగలు పడడం కలకలం రేపింది. ఆలయంలోని గర్భ గుడిలో మూలవిరాట్టుపై ఉన్న ఆభరణాలు దొంగలించడం సంచలనం రేపింది. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రసిద్ధ ఆలయంలో చోరీకి గురవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకున్నారు. నిందితులను కర్ణాటక (Karnataka)లోని బీదర్ లో అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాల జిల్లా (Jagtial District) మల్యాల (Mallial Mandal) మండలంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయంలో ఫిబ్రవరి 24న కాషాయ కండువాలు ధరించిన ఇద్దరు ముసుగు వేసుకుని అర్ధరాత్రి చొరబడ్డారు. తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో బేతాళుడి గుడి ప్రాంతం నుంచి ప్రధాన ఆలయంలోకి చొరబడ్డారు. గర్భగుడిలో ఉన్న వెండి ఆభరణాలను (Silver Ornaments) దొంగతనం చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మొత్తం 10 బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలించారు. సీసీ కెమెరాలు (CC Footage) పరిశీలించి ఫుటేజీ సేకరించారు. చోరీకి పాల్పడ్డ వారిని గుర్తించి వారి రాకపోకలను పరిశీలించారు. వారి కోసం విస్తృతంగా గాలిస్తూ వారిని ట్రాక్ చేయగా కర్ణాటకలోని బీదర్ లో వారి ఆచూకీ లభించింది. వెంటనే తెలంగాణ పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి జగిత్యాలకు తరలించారు. చోరీకి గురైన సొమ్ములో 60 శాతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే నిందితుల అరెస్ట్ పై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.
ఆ ఇద్దరు దొంగలు ఆలయం వెనుక నుంచి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఆలయంలోని 15 కిలోల వెండితో పాటు బంగారు ఆభరణాలను చోరీ చేశారు. 5 కిలలో వెండి ఫ్రేమ్, 2 కిలోల మకర తోరణం, 3 కిలలో శఠగోపాలు, 5 కిలోల స్వామి వారి తొడుగు ఎత్తుకెళ్లారు. కాగా నిందితులు మెదక్ జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని ఓ తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులు వెళ్లిన వాహనాలు ఆధారంగా చేధించారు. అయితే వీరికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారికంగా పోలీసు అధికారులు వివరాలు వెల్లడించనున్నారు.
కాగా యాదాద్రి ఆలయం తరహాలో కొండగట్టు ఆలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ కంకణబద్ధులయ్యారు. ఈ క్రమంలోనే ఈనెల 15న కొండగట్టులో 21 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించారు. గతంలోనే ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేయగా.. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రూ.600 కోట్లు అయినా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి నేతృత్వంలో అధికారుల బృందానికి ప్రభుత్వం ఆదేశించింది. అయితే దొంగతనం ఘటనతో ప్రస్తుతం ఆలయ అభివృద్ధిపై కొంత వెనుకడుగు పడినట్లు తెలుస్తున్నది.