సికింద్రాబాద్ లష్కర్ బోనాల నేపథ్యంలో ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారుల రాకపోకలను మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సికింద్రాబాద్(secunderabad )లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు తరలిరావడంతో ఆదివారం లష్కర్ బోనాల(Lashkar bonalu) పండుగ కోలాహలం మొదలైంది. ఇప్పటికే భద్రతతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, భక్తులు వేగంగా ఆలయంలోకి వెళ్లేందుకు వీలుగా క్యూలను రూపొందించామని ఆలయ అధికారులు తెలిపారు. ఈసారి దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఆలయం వెలుపల ఏడు లైన్లు, లోపలి నుంచి ఐదు లైన్లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల రోడ్లపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి సోమవారం జాతర ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు(traffic restrictions) ఉంటాయని పోలీసులు ప్రకటించారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ పీఎస్ రాంగోపాల్‌పేట్, ప్యారడైజ్, సిటిఓ, ప్లాజా, ఎస్బిఐ ఎక్స్ రోడ్, వైఎమ్సిఎ ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్‌లోని రోడ్లు నివారించాలని సాధారణ ప్రజలను పోలీసులు అభ్యర్థించారు. పార్క్ లేన్, బాటా, ఘస్మండి X రోడ్స్, బైబిల్ హౌస్, మినిస్టర్స్ రోడ్, రసూల్‌పురాలో జూలై 10, 2023న జాతర పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలులో ప్రయాణించాలనుకునే సాధారణ ప్రయాణికులు షెడ్యూల్ ప్రకారం చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని సూచించారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించే క్రమంలో ట్రాఫిక్ రద్దీ ఉండవచ్చన్నారు. అందువల్ల ప్రజలు చిలకలగూడ వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 నుంచి ప్రవేశించాలని సూచించారు. సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు(officers) పేర్కొన్నారు.