అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతడి కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక రాధికా మర్చంట్ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఖర్చుతో ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అలంకరించారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు.
ముంబైలోని నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో అంబానీ కుటుంబసభ్యులు, స్నేహితులు, మర్చంట్ కుటుంబసభ్యులు, కొద్దిపాటి బంధువులు పాల్గొన్నారు. అంబానీ కుటుంబానికి చెందిన శ్రీకృష్ణుని ఆలయంలో గుజరాతీ సంప్రదాయం ప్రకారం గోల్ ధన, చునారి విధి కార్యక్రమాలు నిర్వహించారు. గోల్ ధన అంటే బెల్లం, కొత్తిమీర గింజలు అని అర్ధం. ఇది పెళ్లికి ముందు గుజరాతీ సంప్రదాయంలో నిర్వహించే వేడుక. ఇరు కుటుంబసభ్యులు ఇది ఇచ్చిపుచ్చుకుంటారు.
వేడుకల అనంతరం గణపతి పూజ చేశారు. ఈ పందకంభంగా లగాన్ పత్రిక (పెళ్లి పత్రిక) చదివారు. ఆ తర్వాత వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలోనే వీరి వివాహ వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు ఆటపాటల్లో మునిగితేలారు. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారని సమాచారం.
ముకేశ్, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశాడు. ప్రస్తుతం రిలయన్స్ సంస్థల బాధ్యతలు చూస్తున్నాడు. విరెన్ మర్చంట్-శైల దంపతుల ముద్దుల కూతురు రాధిక మర్చంట్ న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో చదువుకుంది. ప్రస్తుతం ఎన్ కోర్ హెల్త్ కేర్ బోర్డులో డైరెక్టర్ గా ఉంది. వీరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటవుతున్నారు.