»Amit Shah Telangana Tour Fixed Arriving On April 23rd
Amit Shah తెలంగాణ పర్యటన ఖరారు.. ఆ రోజే భారీ చేరికలు
ఈ సభ ద్వారానే కమలం పార్టీ ఎన్నికలకు శంఖారావం పూరించే అవకాశం ఉంది. ఈ పర్యటనలోనే కీలకమైన నాయకులను పార్టీలో చేర్పించుకునేందుకు చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ బృందం సిద్ధమైంది.
తెలంగాణ (Telangana) అధికారమే లక్ష్యంగా బీజేపీ రాజకీయం నడిపిస్తోంది. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, జేపీ నడ్డా, అమిత్ షా పర్యటనలు తెలంగాణలో విస్తృతంగా జరుగుతున్నాయి. కాగా, కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రాజకీయ పర్యటన తాజాగా ఖరారైంది. ఈనెల 23వ తేదీన ఆయన తెలంగాణకు రానున్నాడు.
చేవెళ్ల (Chevella) లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభను విజయవంతం చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కాగా, ఈ పర్యటనలోనే కీలకమైన నాయకులను పార్టీలో చేర్పించుకునేందుకు చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajedar) బృందం సిద్ధమైంది. ఇటీవల బీఆర్ఎస్ (BRS Party) నుంచి సస్పెండ్ కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) పార్టీలోకి చేర్చుకునేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కలిసి వస్తే వారిద్దరూ అమిత్ షా పర్యటనలో కాషాయ కండువా వేసుకునే అవకాశం ఉంది.
గతంలో అమిత్ షా పర్యటనలు ఖరారై చివరి నిమిషంలో రద్దయ్యాయి. కొన్ని రోజుల కిందట కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా రాజకీయపరమైన అంశాలపై దృష్టి సారించలేదు. ఈసారి పూర్తి రాజకీయ పర్యటన కావడంతో రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభ ద్వారానే కమలం పార్టీ ఎన్నికలకు శంఖారావం పూరించే అవకాశం ఉంది. చేవెళ్లలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభ ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలపై ఒక ప్రభావం చూపుతుందని బీజేపీ భావిస్తోంది.