కుల బహిష్కరణ (Caste Exclusion) చేశారని ఆ పెద్ద మనిషి మనస్తాపానికి గురయ్యాడు. రెండు నెలలుగా మనో వేదనతో లోనైన వ్యక్తి అదే బాధతో కన్నుమూశాడు. అయితే అతడి అంత్యక్రియలు (Last Funeral) జరిపించడానికి కూడా కుల పెద్దలు అడ్డుకున్నారు. అతడి అంతిమ సంస్కారాల్లో కులస్తులు ఎవరూ పాల్గొనకూడదని, పాల్గొంటే రూ.10 వేల జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఒక్క తాటిపైకి వచ్చి అతడి అంత్యక్రియలు జరిపించారు. ఈ అమానుష సంఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో (Warangal District) చోటుచేసుకుంది.
గ్రేటర్ వరంగల్ (Greater Warangal) 17వ డివిజన్ బొల్లికుంటలో (Bollikunta) బొజ్జ మల్లయ్య (74) కుటుంబం నివసిస్తోంది. కుల సంఘంలో ఈయన ఓ సభ్యుడు. నెల నెల కుల సంఘంలో పొదుపు డబ్బులు కట్టేవాడు. అయితే కరోనా సమయంలో సంఘంలో పని చేసే కోశాధికారి (Treasurer) రూ.8 లక్షలు సంఘం డబ్బులు వాడుకుని పరారయ్యాడు. ఆ డబ్బులు సభ్యులు కట్టాలని సంఘం తీర్మానించింది. దీన్ని మల్లయ్య ప్రశ్నించాడు. అతడు పారిపోతే తాము ఎందుకు కట్టాలి? అని మల్లయ్య, అతడి కుమారుడు కుల పెద్దలను నిలదీశారు. తమపై ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లయ్య కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. ఇది జరిగి రెండు నెలలైంది.
కాగా అప్పటి నుంచి మాసినక ఆవేదనకు గురైన మల్లయ్య మంచం పట్టాడు. అదే కుంగుబాటుతో ఆదివారం మృతి చెందాడు. అతడి మృతిపైన కూడా కుల సంఘం పంచాయితీ పెట్టింది. అతడి అంత్యక్రియలకు కులస్తులు హాజరుకాకూడదని తేల్చి చెప్పింది. అంత్యక్రియల్లో పాల్గొంటే రూ.10 వేలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు హెచ్చరించారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులపోళ్లు రాకుంటే ఏందీ అంటూ గ్రామమంతా ఒక్కటై మల్లయ్య అంత్యక్రియలను నిర్వహించారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి సామాజిక దురాచారాలు జరగడం దారుణం.