»Telangana Ssc Hindi Question Paper Leaks In Warangal District
SSC Exams లీకుల పర్వం.. హిందీ ప్రశ్నాపత్రం కూడా
ఈ లీకుల వెనుక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగి ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒప్పందం చేసుకుని ఇలా ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ఇలా లీకులకు తెర తీస్తున్నాయనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణలో లీకుల (Paper Leaks) పర్వం కొనసాగుతున్నది. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలే కాదు విద్యాపరమైన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు (Question Papers) కూడా లీకవుతున్నాయి. అది పదో తరగతి వార్షిక పరీక్షలకు (SSC Exams) పాకిన విషయం తెలిసిందే. నిన్న తెలుగు పశ్నాపత్రం లీకవగా.. నేడు హిందీ పశ్నాపత్రం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణలో (Telangana) పదో తరగతి పరీక్షలపై నీలిమేఘాలు అలుముకున్నాయి. వరుస లీకులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది. దీంతో లీక్ ల వ్యవహారంలో తెలంగాణలో సంచలనం రేపుతున్నది.
నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో (Tandur) తెలుగు ప్రశ్నాపత్రం లీకైన విషయం తెలిసిందే. ఓ ఉపాధ్యాయ ప్రబుద్ధుడు (Govt Teacher) ఫొటోలు తీసి వాట్సప్ గ్రూపులో పెట్టేశాడు. ఏ ఉద్దేశంతో ఆయన ఇలా చేశాడో కానీ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. అది మరచిపోక ముందే నేడు మంగళవారం హిందీ ప్రశ్నాపత్రం (Hindi Exam) బయటకు వచ్చింది. వరంగల్ జిల్లాలో (Warangal District) హిందీ పేపర్ లీక్ అయ్యింది. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. లీకైన పేపర్ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై స్పందించిన అధికారులు ఇది లీక్ కాదు సర్క్యులేట్ మాత్రమే అని చెబుతున్నారు. ఈ లీకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఈ లీకుల వెనుక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగి ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒప్పందం చేసుకుని ఇలా ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ఇలా లీకులకు తెర తీస్తున్నాయనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి. కాగా లీక్ లను అరికట్టాలని.. లేకపోతే మొత్తం పది పరీక్షలను రద్దు చేయాలని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.