సామాజిక సేవకు కొందరు వ్యాపారులు, సంపన్నులు అండగా ఉంటారు. సంపాదనలో తోచినంత సేవ కార్యక్రమాలకు (Social Service) ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారిని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి మోసమే (Fraud) ఒకటి జరిగింది. ఏకంగా రూ.6.6 కోట్లు సేవ పేరు చెప్పి దోచుకున్న సంఘటన హైదరాబాద్ (Hyderabad)లో చోటుచేసుకుంది. కాగా ఆ మోసం చేసింది ఒక మహిళా కావడం గమనార్హం. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ (SR Nagar)కు చెందిన ఓ వ్యక్తి రసాయన ఎరువుల సంస్థ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో (Corporate Social Responsibility – CSR) భాగంగా తమ సంస్థ తరఫున అనాథలు, స్వచ్ఛంద సంస్థలకు సహాయం అందిస్తుంటారు. అన్నార్థుల కోసం ఆయన తపిస్తుంటారు. వారిని ఆదుకునేలా తోచిన సహాయం చేస్తుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ మహిళ అతడిని మోసం చేసింది.
గత సంవత్సరం జూన్ లో హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన ప్రతినిధి అంటూ ఆ మహిళ పరిచయం చేసుకుంది. ఎండీకి ఫోన్ చేసి ఒకరికి అవయవ మార్పిడి (Organ Transplant) చేయాలని, దీనికి మీరు ఆర్థిక సహాయం అందించాలని మహిళ కోరింది. దయాగుణుడైన ఎండీ మహిళ చెప్పినట్టు చేశాడు. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఆన్ లైన్ లో ఆ మహిళ ఏకంగా రూ.6.69 కోట్లు వసూలు చేసింది. అయితే సీఎస్ఆర్ (CSR) కింద సహాయం అందించడంతో ఆ వివరాలు నమోదు చేసేందుకు ఎండీ చికిత్స వివరాలు ఆరా తీశారు.
బిల్లులు, ఇతర ఆధారాలు పంపాలని సదరు మహిళను కోరారు. ఇక అప్పటి నుంచి ఆ మహిళ దొరక్కుండా తప్పించుకుంటోంది. వివరాలు అడిగితే అడ్డమైన కారణాలు చెబుతూ వస్తోంది. దీంతో మహిళ సైబర్ నేరగాళ్ల (Cyber Crime) మాదిరి తెలిసిన వారితో డ్రామాలు ఆడించింది. ఎండీ మొబైల్ ఫోన్ అభ్యంతరకర చిత్రాలు, సందేశాలు పంపించి వేధించడం ప్రారంభించారు. డబ్బులు అడిగితే మార్ఫింగ్ సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తాను మోస పోయానని గ్రహించిన ఎరువుల సంస్థ ఎండీ పోలీసులను (Cyberabad Cyber Police) ఆశ్రయించాడు. సేవ పేరిట మహిళ మోసానికి పాల్పడిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.