Cyber crime : ఫేస్బుక్ ఫ్రెండ్ రూపంలో మోసం… ఎనిమిది లక్షలు పోగొట్టుకున్న టీచర్
ఇటీవల కాలంలో రకరకాలుగా మోసగాళ్లు సైబర్ క్రైంకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు భయపడి ఎనిమిది లక్షలు వారి ఎకౌంట్‌కు ట్రాన్స్వర్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి వాటిపై అంతా అవగాహనతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలేం జరిగిందంటే..?
Cyber crime: సైబర్ క్రైం మోసగాళ్లు(fraudsters) ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి లక్షల్లో డబ్బును దోచేస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో వరుసగా బయట పడుతుండటం గమనార్హం. అంతా ఇలాంటి ఘటనల పట్ల అవగాహనతో ఉండాల్సిందే. తాజాగా ముంబయికి చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ టీచర్ సైబర్ క్రైం మోసగాళ్ల వలలో చిక్కి రూ.8 లక్షల వరకు మోసపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చదివేయండి.
ఓ మహిళా ఉపాధ్యాయురాలికి దేవ్ పటేల్ పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె అతడెవరో తెలియకపోయినా రిక్వెస్ట్‌ని ఓకే చేశారు. ఆ తర్వాత అతడు ఆమెతో మెల్లగా ఛాటింగ్ చేయ సాగాడు. పరిచయం పెంచుకున్నాడు. బ్రిటీష్ ఎయిర్ వేస్‌లో తాను పైలెట్ అని చెప్పాడు. దుబాయ్‌లో ఉంటానని నమ్మబలికాడు. కొంత కాలం వారు ఛాటింగ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆమెకు బహుమతి పంపించినట్లు చెప్పాడు. కొరియర్ వస్తుంది తీసుకోమన్నట్లుగా తెలిపారు.
ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ టీచర్‌కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. డిల్లీ కస్టమ్స్ ఆఫీసర్ అంటూ ఆ ఫోన్ కాల్లో ఒక మహిళ మాట్లాడింది. దుబాయ్ నుంచి ఒక పార్శిల్ వచ్చిందని తెలిపింది. దాన్ని పొందాలంటే రూ.70వేలు డిపాజిట్ చేయాలని చెప్పింది. దీంతో టీచర్ ఆ మొత్తాన్ని ట్రాన్స్వర్ చేశారు. తర్వాత ఆమెకు మరో కాల్ వచ్చింది. పార్శిల్లో 80 బ్రిటీష్ పౌండ్లు ఉన్నాయని వారు చెప్పారు. అక్రమంగా డబ్బు పంపించినందుకు రూ.2.95 లక్షలు చెల్లించాలని లేదంటే పోలీసులు అరెస్టు చేస్తారని చెప్పారు. దీంతో భయపడిన ఆమె మళ్లీ డబ్బు ట్రాన్స్వర్ చేశారు. అలా రకరకాలుగా ఆమె నుంచి మే 1 నుంచి 10వ తారీఖు లోపు 8.15 లక్షలు వారు ట్రాన్స్వర్ చేయించుకున్నారు. ఆ ఫేస్బుక్ ఫ్రెండ్ సైతం ఆమె మెసేజ్‌లకు, కాల్స్‌కు స్పందించడం మానేశాడు. అప్పటికి గాని ఆమెకు తాను మోసపోయినట్లు అర్థం కాలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైం(Cyber crime) పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.