»Aehra Electric Car Sedan 800 Kilometers On A Single Charge
Aehra: ఎలక్ట్రిక్ కారు సెడాన్..ఒక్క ఛార్జ్ తో 800 కిలోమీటర్లు!
ఇటలీలో జరుగుతున్న మిలానో మోంజా మోటార్ షోలో ఇటాలియన్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఎహ్రా(Aehra) కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ కారును పరిచయం చేసింది. ఇది చూసిన పలువురు ఔరా అంటున్నారు. అయితే ఈ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల మధ్య పోటీ ఎక్కువైంది. ఇప్పటికే ఎలాన్ మస్క్ టెస్లా కార్లను రిలీజ్ చేయగా..అందుకు దీటుగా పలు కంపెనీలు కార్లను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే 2022 మధ్యలో ప్రకటించబడిన ఇటాలియన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ “మొబిలిటీ బ్రాండ్” అయిన ఎహ్రా(Aehra) లగ్జరీ EV కారు సెడాన్(sedan) మోడల్ ను ఇటీవల ఆవిష్కరించారు. అయితే ఇది కారు స్పాయిలర్‌లో కొంత భాగాన్ని మాత్రమే చూపించారు. అయితే ఎహ్రా చీఫ్ డిజైన్ ఆఫీసర్ ఫిలిప్పో పెరిని గతంలో ఆడి, లంబోర్ఘిని, ఇటాల్డిజైన్లకు డిజైనర్‌గా పనిచేయడం విశేషం.
సెడాన్ హై-ఎండ్ ఈవీ మోడల్ కారు ఎరుపు రంగులో చాలా లగ్జరీగా కనిపిస్తుంది. దీనికి సాధారణ డోర్స్ కాకుండా పైకీ లేచే విధంగా ఉన్నాయి. దూకుడుగా కనిపించే ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే దాదాపు 500 మైళ్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీంతోపాటు 165 mph గరిష్ట వేగంతో నడుస్తుందని వెల్లడించారు. ఇది రీడిజైన్ చేయబడిన బానెట్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLలు), బంపర్-మౌంటెడ్ ఫాగ్‌ల్యాంప్‌లతో కూడిన సున్నితమైన LED హెడ్‌ల్యాంప్‌లు వంటీ సౌకర్యాలు ఉన్నాయి. దీంతోపాటు ఫ్రంట్ ఎయిర్ స్ప్లిటర్, ORVMల స్థానంలో కెమెరాలు, ఒక రేక్డ్ విండ్‌స్క్రీన్, వాలుగా ఉండే రూఫ్‌లైన్, పైకి తెరుచుకునే డబుల్ టెయిల్ ల్యాంప్స్, ఫాల్కన్ డోర్లు, LED టెయిల్‌లైట్స్ కూడా ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ కారు ఒకే ఛార్జ్‌తో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. పోర్స్చే టైకాన్తో పోటీపడనుంది. అయితే 2024లో ఎప్పుడైనా ముందస్తు ఆర్డర్లు ప్రారంభం కావచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఈ వాహనం టెస్టింగ్ దశలో ఉంది. దీనిని 2025 నాటికి ప్రారంభించవచ్చు. అదే సమయంలో దీని డెలివరీ 2026 నాటికి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రాయిటర్స్ ప్రకారం సెడాన్ SUV రెండింటి ధర ట్యాగ్లు సుమారు $175,000 నుంచి $197,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. అయితే ప్రతి సంవత్సరం ఒక్కో మోడల్లో సుమారు 25,000 యూనిట్లను నిర్మించాలని ఎహ్రా సిద్ధమైనట్లు సమాచారం. Aehra మిలన్లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. ఎహ్రా ప్రారంభ కీలక మార్కెట్లలో ఉత్తర అమెరికా, యూరప్, చైనా, గల్ఫ్ రాష్ట్రాలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఇక ఇండియాకు ఎప్పుడు వస్తుందనే విషయం మాత్రం వెల్లడించలేదు.