భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నళినితో పాటు మరో ఐదుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వీరిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇంతకు ముందే సుముఖతను వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కు కూడా తెలియజేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేసే సమయంలో కూడా గుర్తు చేసింది. వీరి విడుదలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సుముఖతను వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎల్టీటీఈకి చెందిన ఒక మహిళా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడం ద్వారా రాజీవ్ ను హత్య చేశారు. ఈ కేసులో నళిని, శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, పెరారివాలన్ తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. వీరిలో పెరారివాలన్ కు గత మే నెలలో సుప్రీంకోర్టు స్వేచ్ఛను ప్రసాదించింది.
కాగా… సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం అంగీకారయోగ్యం కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేష్ అన్నారు. ఈ తీర్పు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని ప్రకటిస్తూ ..ఇది పూర్తిగా పొరబాటు నిర్ణయమన్నారు. దీన్ని తమ పార్టీ విమర్శిస్తోందని, సబబు కాదని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమస్యపై సుప్రీంకోర్టు భారత దేశ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించలేదని, ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.