VSP: ఏలేరు కాలువ గండితో ఉపాధి పనులు నిలిచిపోయాయి. మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద ఏలేరు కాలువకు గండి పడిన సంగతి తెలిసిందే. ఈ గండి పూడ్చివేతకు నీటి ప్రవాహం అడ్డంకిగా మారడంతో కొండల ఆగ్రహారం వద్ద నీటి మళ్లింపునకు కృత్రిమ గండి కొట్టారు. ఈ నీరంతా బయ్యవరం పెద్దచేరువులోకి చేరడంతో పూడిక తొలగింపు పనులు చేసే వీలు లేదు.
VZM: చీపురుపల్లి పట్టణంలో కొత్త గవిడి వీధిలో తాగునీటి పైపులైను గత కొద్ది రోజులుగా లీకులతో తాగు నీరు వృథాగా పోతుంది. పెద్ద పైపు లైను ద్వారా కొత్త గవిడి వీధి, విజయ కాలనీ, లెక్చరర్స్ కాలనీ వాసులకు తాగునీరు వెళ్తుంది. ఈ లైనుకు రంధ్రం పడి నీరు వృథా అవుతోంది. పంచాయతీ అధికారులు స్పందించి పైపు లైనుకి మరమ్మతు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
ATP: జిల్లాలోని మునిసిపాలిటీ పరిధిలో స్థలం ఉండి ఇండ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి శైలజ శనివారం తెలిపారు. భార్య, భర్త ఆధార్ కార్డులు, స్థలానికి సంబంధించిన రిజిస్టర్ పత్రాలు, డిఫామ్ పట్టా,ఆధార్ లింక్ అయిన బ్యాంకు పాస్ పుస్తకం దరఖాస్తుకు జతపరచాలన్నారు. ఈ నెల 19 వరకు గడువు ఉంటుందన్నారు.
KRNL: గూడూరులోని శ్రీ తిమ్మ గురుడు స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ ఈవో గురెడ్డి, చైర్మన్ ప్రభాకర్ నాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన లెక్కింపులో జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.53 వేల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు అమ్మవారిని పల్లకీలో ఆశీనులుగా చేసి ప్రత్యేక అలంకరణలతో శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు ఘనంగా సాగింది. వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
TPT: రుయా ఆసుపత్రి వైద్యులు ఏలూరుకు చెందిన సుబ్బారావు కడుపులో 10 కేజీల భారీ ప్లీహాన్ని తొలగించి ప్రాణదానం చేశారు. అనేక ఆసుపత్రులు తిరిగినా రోగికి ఈ క్లిష్టమైన ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. రక్తహీనత, తక్కువ ప్లేట్లెట్లతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి డా. శ్రీకాంత్ రెడ్డి బృందం ఆపరేషన్ చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
PPM: వల్లరిగుడబ పంచాయతీ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరింది. పాతబడిన ఈ భవనంలో గోడలు, పునాదుల్లో పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందని సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వారు భయంతోనే అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
E.G: వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనకై 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ఏప్రిల్ 6న తిరుపతి నుంచి ప్రారంభం అయ్యి 700 కిలోమీటర్లు పూర్తి చేసుకోని రాజమండ్రికి చేరుకుంది. ఈ మేరకు వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం శనివారం రాజమండ్రి సిటీ జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణను కలిశారు. సైకిల్ యాత్ర చేస్తున్న బృందాన్ని అభినందించారు.
VSP: వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు అధ్యక్షతన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకొని త్వరితగతిన వార్డు, సచివాలయ కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు .
BPT: కారంచెడు మండలంలోని పశువైద్యశాల భవనం పూర్తిగా పాడై ప్రమాదకరంగా మారింది. గోడలు చెదిరిపోవడం, పైకప్పు దెబ్బతినడం వల్ల సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాన్ని తొలగించి, అదే స్థలంలో నూతన భవనం నిర్మించేందుకు ఆమోదం తెలిపినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ATP: శింగనమల మండలం లోలూరులో ‘మన గ్రామానికి మన శైలజానాథ్’ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కార్యకర్తలు, నాయకులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు అందక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కేవలం రాజధాని ముసుగులో సొంతవాళ్లకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు.
ELR: జిల్లా వ్యాప్తంగా ఉన్న అని పోలీస్ స్టేషన్‌లలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం చుట్టుప్రక్కల మరియు పెరేడ్ గ్రౌండ్ పోలీస్ క్వార్టర్లలో సిబ్బంది శ్రమదానం చేశారు. పనిచేసే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీని కారణంగా విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని వివరించారు.
అన్నమయ్య: పంచాయతీ అభివృద్ధి అధికారులందరూ శిక్షణ జరిగే సమయంలో గ్రీన్ అంబాసిడర్లతో కలిసి తప్పనిసరిగా పనిచేయాలని కడప జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డి సూచించారు. రాజంపేట మండలం కూచివారిపల్లెలో పీడీవోలకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రోజూ చెత్త సేకరించాలని ఆదేశించారు. 3 లేదా 4 రోజులకు ఒకసారి తూతూ మంత్రంగా చెత్త సేకరించి, చేతులు దులుపుకొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
W.G: మైదుకూరు సమీపంలోని కొత్తపాలెంలో ఈ నెల 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మ కర్త సుబ్బరాయుడు తెలిపారు. 30న వీరాంజనే యస్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభి షేకం, కుంకుమార్చన పూజలు ఉండనున్నాయి. మే 1న జిల్లా స్థాయి కోలాట ప్రదర్శన, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నారు.
PLD: ఈ నెల 29న నరసరావుపేటలోని SSN కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు శుక్రవారం తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన ఎమ్మెల్యే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించారన్నారు.