NDL: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను ఆయన గురువారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
PLD: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవాలయ చరిత్రపై రూపొందిన డాక్యుమెంటరీని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు ఆవిష్కరించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని డా. చిట్టినేని లక్ష్మీనారాయణ నిర్మించి దర్శకత్వం వహించారు. ఆలయ చరిత్ర, స్థల పురాణం ఇందులో వివరించారు. ఇలాంటి డాక్యుమెంటరీలు భావితరాలకు మార్గదర్శకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
KRNL: ఆలూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబర్చారు. గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను ఇవాళ ప్రిన్సిపల్ వీరేష్ సత్కరించారు. జనాభా సంస్కరణ అంశంపై నిర్వహించిన పోటీలో విజయం సాధించారు. చదువుతో పాటు సమాజ స్పృహ పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.
TPT: తిరుమలలో ఏప్రిల్ 25 నుంచి జరిగే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన మండపాన్ని దశావతారం, అష్టలక్ష్ముల ఆకృతులతో సుమారు 100 మంది నిపుణులు అలంకరిస్తున్నారు. మూడు రోజుల పాటు గజ, అశ్వ, గరుడ వాహన సేవలతో పాటు కళ్యాణ మహోత్సవం జరగనుంది.
EG: ఎన్డీఏ కూటమి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రిలో పాదయాత్ర గురువారం నిర్వహించారు. మహిళలతో కలిసి ఎంపీ పురందేశ్వరి నల్ల దుస్తులు ధరించుకుని హాజరయ్యారు. పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారి శక్తిని నిరూపించుకునే సమయమని ఆమె పిలుపునిచ్చారు.
SS: నేరాల నివారణపై పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామసభలు నిర్వహించి సైబర్ నేరాలు, ఆస్తి నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా జాగ్రత్తలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. అనుమానితుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని సూచిస్తున్నారు.
కోనసీమ: విద్యార్దులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మండపేట రూరల్ ఎస్సై కిషోర్ తెలిపారు. తాపేశ్వరం శ్రీ పోలిశెట్టి సత్తిరాజు భూషణం జడ్పీ హైస్కూల్‌లో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.
CTR: గుడిపాల పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ వెంకటనారాయణ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల స్థితిగతులను సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో నిఘా పకడ్బందీగా ఉండాలని, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించరాదని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు.
TPT: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ విస్తృత వైద్య ఏర్పాట్లు చేసింది. అశ్వనీ ఆసుపత్రి ప్రధాన కేంద్రంగా మొత్తం 16 వైద్య కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో 24 గంటల వైద్యం అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితుల కోసం 9 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. భక్తుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ, ఎక్కడికక్కడ తక్షణ చికిత్స అందేలా టీటీడీ పక్కా చర్యలు చేపట్టింది.
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి వాహిని సుధామృత కార్యక్రమం ఘనంగా జరిగింది. భగవాన్ బాబా రచించిన 15 వాహినుల్లోని సనాతన ధర్మ సూత్రాలను అధ్యయనం చేసేందుకు 12 భాషల్లో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. మూడు ఏళ్లుగా సాగుతున్న ఈ కోర్సులో 106 పాఠ్యాంశాల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భక్తులకు అందిస్తున్నారు.
సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
PLD: మే 1 నుంచి 30 వరకు ఇంటింటా ఇళ్లగణన నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో స్వర్ణ తెలిపారు. ఏప్రిల్ 15–30 మధ్య సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఆన్‌లైన్ విధానం కూడా అందుబాటులో ఉందన్నారు. ముప్పాళ్ల మండలంలో కార్యక్రమాన్ని శివప్రసాద్ పర్యవేక్షిస్తూ, సిబ్బంది క్లస్టర్ల వారీగా ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించాలని సూచించారు.
కృష్ణా: మచిలీపట్నంలో సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నవీన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ప్రజల సౌకర్యం కోసం సత్య సాయి సేవ సమితి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమన్నారు.
VZM: బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయనను డీఈవో U.మాణిక్యం నాయుడు కోరారు. ఈ మేరకు గురువారం బొబ్బిలికోటలో ఆయనను కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చూస్తానని తెలిపారు.
కడప జిల్లాలోని తొండూరు బీసీ హాస్టల్‌కు చెందిన విద్యార్థి గురు ప్రణీత్ కుమార్ (11) టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్. సవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.