AKP: ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పురుషోత్తం హెచ్చరించారు. పాయకరావుపేటలో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వివిధ అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బాలికల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూ క్రిమినల్ చట్టాలు, పోస్కో యాక్ట్, సైబర్ ఫ్రాడ్ గురించి వివరించారు.
ASR: గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ జీ.దేముళ్లు అన్నారు. ఈగల్ టీమ్, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
BPT: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.50 లక్షల CSR నిధులతో నిర్మించిన నూతన కాపు కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ భవనం కాపు సామాజికవర్గ వివాహాలు, ఆత్మీయ సమావేశాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
NDL: ‘జలమే జీవం – జల సంరక్షణే ధ్యేయం’ అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం కరివేన చెరువు కాలువ వద్ద ఇవాళ జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.
ASR: బీజమరవలసలో ఈనెల 18న నాటు తుపాకీతో మహిళలపై కాల్పులు జరిపిన నిందితుడు లక్ష్మణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాఫీ తోటకు నిప్పు పెట్టారన్న అనుమానంతో బీమలమ్మ (53),ఆమె కుమార్తె శిరీషా (16)పై కాల్పులు జరపడంతో ఇద్దరూ గాయపడ్డారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై ఎల్.సురేష్ ఇవాళ తెలిపారు.
KRNL: పర్యావరణ పరిరక్షణలో ప్రతి వ్యక్తీ తన బాధ్యతను గుర్తించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. ఇవాళ దుపాడు అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ప్రపంచ భూమి దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నీటి ఆదా, విద్యుత్ వినియోగం తగ్గించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం అవసరమని తెలిపారు.
W.G: డిగ్రీలు లేని దిగ్గజం శకుంతలాదేవి అని HM కొల్లాబత్తుల సూర్యకుమార్ అన్నారు. పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం వల్ల చదువుకోలేకపోయినా, మేధస్సుతో గణితంలో అత్యంత ప్రావీణ్యతను చూపిన గణిత దిగ్గజం శకుంతలాదేవి అని అన్నారు.
మార్కాపురం నియోజకవర్గంలోని 102 చెరువులను బాగు చేసి వాటిని వచ్చే వర్షాకాలంలో నీటిని నింపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులకు ఆదేశించారు. మంగళవారం మార్కాపురం కలెక్టరేట్లో ‘జలధార జలహారతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే భూగర్భ జలాలను పెంచాలన్నారు.
కోనసీమ: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన సెల్ ఫోన్లను సాంకేతికత సహాయంతో గుర్తించి రికవరీ చేసినట్లు ఎస్సై జి. సురేంద్ర తెలిపారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు మంగళవారం తిరిగి అందజేసినట్లు చెప్పారు. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.
PLD: నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పీజీ ప్రవేశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ రవికుమార్ ఉన్నత విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఇతర అతిథులు పీజీ కోర్సులు, అడ్మిషన్ విధానం, పరిశోధన అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాపట్ల: పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి తాగుతూ.. అమ్ముతున్న 29 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీ చంద్రమౌళి ఈ వివరాలను వెల్లడించారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పట్టణ సీఐ రాంబాబు, ఎస్సైలు విజయ్ కుమార్, నస్రీన్, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా వారికి నగదు బహుమతులు అందజేశారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్‌లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను చైర్పర్సన్ బల్లా పల్లవి సమీక్షించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అతి త్వరలోనే అన్ని సౌకర్యాలతో దీనిని రైతులకు, వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు.
AKP: పరవాడ మండలం తాడి సమీపంలో రాంకీ యాజమాన్యం రసాయనిక వ్యర్థాలను నిల్వ చేయడానికి తవ్వుతున్న చెరువును వెంటనే మూసివేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం లంకెలపాలెంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. భూగర్భ జలాలు ఇప్పటికే కాలుష్యం అయినట్లు పేర్కొన్నారు. చెరువుకు అనుమతిస్తే కాలుష్యం మరింత పెరుగుతుందన్నారు.
కృష్ణా: మొవ్వ మండలం అవురుపూడి గ్రామంలో వేసవి తీవ్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘వేసవిలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం మన బాధ్యత. ప్రతి గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
NTR: ఏ. కొండూరు(M) కేజీ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ అసోసియేషన్ సభ్యుడు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లి-శిశు ఆరోగ్యం, పిల్లల మెదడు అభివృద్ధికి ప్రారంభ దశ నుంచే సమతుల్యమైన పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు.