ASR: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం పాడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయ సాధకుడిగా, పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు.
TPT: ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య రైలు పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వెంకటగిరి(M) కాంపాలెం గ్రామానికి చెందిన శ్రీను రైల్వే గేటు సమీపంలో పట్టాలు దాటే క్రమంలో బైకు అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AKP: సబ్బవరం మండల కేంద్రంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వద్ద నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా జీవించే రోజు వచ్చినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ అప్పలస్వామి, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల, సాయంత్రం 5:45 గంటలకు బదులుగా 6:45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించి తమ ప్రయాణాలను సర్దుబాటు చేసుకోవాలని కోరారు.
SKLM: జిల్లాలో మత్స్య సంపద పునరుత్పత్తిని కాపాడేందుకు సముద్రంలో చేపల వేటపై ఇవాళ అర్ధరాత్రి నుంచి నిషేధం అమల్లోకి రానుంది. జూన్ 16 వరకు కొనసాగే ఈ నిషేధ కాలంలో వేట సాగిస్తే చేపల గుడ్లు, ఉత్పత్తులు నశించిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు ఈ 61 రోజుల పాటు వేటకు దూరంగా ఉండి సహకరించాలని మత్స్యశాఖ అధికారులు కోరారు.
CTR: పెద్దపంజనిలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తమ వద్ద అద్భుత శక్తులు గల వస్తువు ఉందని నమ్మించి ఓ బాధితుడి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి నిందితులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.
E.G: బొమ్మూరులోని అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని నివాళులర్పించారు. క్యాంపస్ నియామకాలతో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. అనంతరం ఉచిత కోచింగ్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ELR: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి దిక్సూచి వంటి భారత రాజ్యాంగాన్ని రచించిన డా.బీ.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కలెక్టర్ కే. వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏలూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అంటరానితనం, కుల వివక్షలపై రాజీలేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
ప్రకాశం: ఒంగోలు మండలం వెంగమక్కపాలెం గ్రామం సమీపంలో మంగళవారం టిప్పర్ లారీ కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. టిప్పర్ రివర్స్ చేసుకునే క్రమంలో టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్న వృద్ధుడు టిప్పర్‌ను ఢీకిని టైర్ల మధ్య పడి నలిగిపోయాడు. మృతుడు టంగుటూరు మండలం ఎర్రజర్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
AKP: చోడవరం మండల కేంద్రంలో ఇవాళ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చోడవరం ఎంపీడీవో ఆంజనేయులు తెలిపారు. తాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రజా సమస్యలు, గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
ASR: రాజవొమ్మంగి గ్రామ సచివాలయంలో ఎంపీడీవో యాదగిరేశ్వరావు మంగళవారం గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్యలు ఉంటే తెలపాలని ఆయన కోరారు. ముర్లవానిపాలెంలో తాగునీరు సమస్య నెలకొందని, చేతి పంపు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
కృష్ణా: అవనిగడ్డలో రూ.61 లక్షలతో నిర్మించిన అన్న క్యాంటీన్ అందుబాటులోకి రానుంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ఉదయం 11 గంటలకు ఈ క్యాంటీన్ ప్రారంభిస్తారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ పర్యవేక్షణలో ఈ అన్న క్యాంటీన్ నిర్మించారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఈ అన్న క్యాంటీన్ ప్రారంభం కానుండటంతో కార్మికులకు మేలు కలుగనుంది.
SKLM: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. మెలియాపుట్టి మండల కేంద్రంలో పీఎం ఎస్సీ,ఎస్టీ సూర్యఘర్ ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి ప.గో. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలోని 29 బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకుడు రామ్ కుమార్ మంగళవారం తెలిపారు. గ్రూప్-4కు డిగ్రీ ఉత్తీర్ణత పొంది 18-52 ఏళ్లున్న వారు అర్హులని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను అందజేయాలని చెప్పుకొచ్చారు.