GNTR: తెనాలి పట్టణ పరిధిలోని సీబీఎన్ కాలనీలో ట్యాంకు వద్ద పైపు లైన్ లీకు ఏర్పడిన కారణంగా సోమవారం పలు వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిచిపోతుందని కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని 21, 22, 23 వార్డులకు ఉదయం నుంచి మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
TPT: నాయుడుపేట వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా నాయకులు మద్దాల సోమశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
VSP: సృజన-2026 సాంకేతిక చర్చ వేదికలో విద్యార్థుల సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం దేశ భవిష్యత్తుకు కీలకమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ అన్నారు. ఆదివారం విశాఖలో ఏబీవీపీ, ఏఐసీటీటఈ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ లో అర్జీలు సమర్పించవచ్చని, 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
SKLM: మందసలోని పెద్ద కేసుపురంలో ఆదివారం పిడుగుపాటుకు తల్లి, కుమార్తె మృతి చెందారు. గ్రామానికి చెందిన కృష్ణవేణి (35), కుమార్తె చిన్ని (15) జీడీ తోటలో పనులు చేస్తున్నారు. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో పెద్ద శబ్దంతో పిడుగు అకస్మాత్తుగా వారు పనిచేస్తున్న తోటలో పడగా అక్కడికక్కడే మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ASR: అడ్డతీగల మండలం కొనలోవ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ఆదివారం సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
AKP: జగ్జీవన్ రామ్ పేరుతో నిర్మించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని సీపీఐ పాయకరావుపేట మండల కార్యదర్శి వి. అర్జున్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శబరి కాలనీలో జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా బడ్జెట్లో రూ. 600 కోట్లు కేటాయించారన్నారు.
E.G: ప్రతి ఇంటి ముందు సాధారణంగా మహిళలు ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులతో సాంప్రదాయ వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది. అమరాతి చట్టబద్దత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆదివారం అనపర్తి నియోజకవర్గం రామవరంలో “మన రాజధాని మన అమరావతి” అంటూ మహిళనె ముగ్గులు వేశారు. ఎంతోమంది ఈ ముగ్గును ఆసక్తిగా తిలకించారు.
PLD: ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చి ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఈ శిబిరాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పల్లెల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
CTR: తవణంపల్లి మండలంలో యువకుడి హత్య కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు యువరాజ్(18)తో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వివాదం కారణంగా 01-04-2026న కొత్త చెరువు వద్ద లవకుమార్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 03-04-2026న కేసు నమోదు చేసి, 05-04-2026న తెలగుండ్లపల్లి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కీలక చర్యలు చేపట్టారు. ఆదివారం కరప, కాకినాడ రూరల్ ప్రాంతాల మత్స్యకారులకు బోట్లు, వలలు, ఇంజన్లు, ఆటోలు, ఐస్ బాక్సులను పంపిణీ చేశారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు పరికరాలు అందజేశారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి పై సంకటహర చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఆర్జిత సేవల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రద్దీ నియంత్రణకు రూ.500 టికెట్లు, అంతరాలయ దర్శనం నిలిపివేశారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈవో శీనానాయక్ పరిశీలించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
ప్రకాశం: రాయవరం బస్సు ప్రమాదంలో మరణించిన కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి పంచాయతీ మండాదిరివారిపల్లి గ్రామానికి చెందిన ఉప్పు రమాదేవి కుటుంబాన్ని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం పరామర్శించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రకటించిన రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
BPT: సంతమాగులూరు మండలంలోని పాత మాగులూరు పంచాయతీ పరిధిలోని యాదవుల బజార్ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఈ రోజు బోర్ తవ్వక పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ బోర్ తవ్వకం పూర్తయిన అనంతరం ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు కొబ్బరితోట ప్రాంతానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు చింతల సత్యను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ఈ మేరకు ఆమె అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు, బియ్యం బస్తా అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.