VSP: విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది. దీంతో అవయవాలు పనిచేయక చనిపోయింది.
TPT: తిరుపతి స్విమ్స్ అన్న క్యాంటీన్ వద్ద ఓ వ్యక్తి చనిపోయి ఉండటాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు. మృతుని జేబులో లభించిన వికలాంగుల ఆర్టీసీ బస్సు పాస్ ఆధారంగా అతను అన్నమయ్య జిల్లా గాలివీడు ప్రాంతానికి చెందిన పి.పెంచలయ్యగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ను సంప్దించాలని పోలీసులు కోరారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పంచాయతిలో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్య ప్రసాద్ బుధవారం ‘మాట – మంతి’ నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన దెయ్యాల సూర్యనారాయణ అనే వ్యక్తి తన ఇంటిలో నిద్రిస్తుండగా, ఉదయం 6 గంటలకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గోడ దూకి కత్తితో హత్యచేసి పరారయ్యాడు. రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: డుంబ్రిగుడ మండలంలోని కించుమండ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. పూర్తిస్థాయి ప్రహరీ లేకపోవడంతో బయట వ్యక్తులు, మూగజీవాలు లోపలకు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తెలిపారు.
కోనసీమ: సఖినేటిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రూరల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ కేంద్రంలో బుధవారం ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి బిసం తెలిపారు. ఆయుర్వేదం, అల్లోపతితో పాటు ఏఐ వంటి నూతన విధానంలో రోగులకు పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
KDP: మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిని దువ్వూరు మండల వైసీపీ కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పార్టీ పరిస్థితులను శంకర్ రెడ్డి వివరించారు. కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.
TPT: మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేశ్, ఏవిఎస్వో రాధాకృష్ణ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మిథాలి రాజ్కు అర్చకులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయాధికారులు ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
CTR: పూతలపట్టులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 9మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ గోపి తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో మెరుపు దాడి చేసి 9 మందికి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసి వారి అడ్రస్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ATP: అనంతపురం బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా గాజుల పద్మజ ఎన్నికవ్వడంపై జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది జిల్లా చరిత్రలో సువర్ణ అధ్యాయమని కొనియాడారు. పార్టీ శ్రేణులతో కలిసి పద్మజను ఆమె స్వగృహంలో ఘనంగా సత్కరించారు. తండ్రి నారాయణస్వామి ఆశీస్సులతో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
VSP: మధురవాడలోని బక్కన్నపాలెం సమీపంలోని ఓ లేబర్ క్యాంప్‌లో యువకుడు హత్యకు గురయ్యాడు. పీఎంపాలెం CI బాలకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. జార్ఖండికి చెందిన సికింధర్(19) తోటి కూలీలైన శ్యామ్, నజరుల్లతో మంళవారం వివాదం జరిగింది. దీంతో వారు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన సికింధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
NLR: కందుకూరు MLA నాగేశ్వరరావుపై పట్టణానికి చెందిన మాదాల నరసింగరావు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రచారం వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
KDP: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వేముల SI ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.
W.G: పాలకొల్లు (M) పెద మామిడిపల్లి సమీపంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెంలో ఓ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు కారులో అంతర్వేది విహారయాత్రకు వెళ్తుండగా, కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వరిచేనులోకి దూసుకెళ్ళింది. స్థానికులు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా: మచిలీపట్నం రేవతి సెంటర్‌లో గల అగ్నిమాపక కేంద్రాన్ని కలెక్టర్ బాలాజీ సందర్శించి, నిన్నటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించుటకు ప్రజలను చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.