విజయవాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడు బీభత్సం సృష్టించాడు. కారుతో బైక్‌ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
YCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC) రుహుల్లా అనుచరుడు జమీర్ బాషా (zameer basha) ర్యాష్ డ్రైవింగ్ ఒకరి ప్రాణాలను తీసింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు బీఆర్టీఎస్ భానునగర్ సర్కిల్ దాటిన తర్వాత బైక్‌ను కారు ఢీ కొంది. తర్వాత 200 మీటర్ల వరకు బైక్‌ను ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో లక్ష్మణ్ అనే యువకుడు అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు తీవ్రగాయాలతో విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాత్రి ర్యాపిడో బైక్ టాక్సీ
పటమట రామలింగేశ్వర్ నగర్‌కు చెందిన పారుపల్లి లక్ష్మణ్ (laxman) డిగ్రీ చేస్తున్నాడు. తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డారు. తల్లి గృహిణి.. ఇంటి బాధ్యతలు లక్ష్మణ్ మీద పడ్డాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అద్దాల పనిచేసేవాడు. రాత్రి నుంచి ఉదయం వరకు ర్యాపిడో టాక్సీ నడుపుతుంటాడు. నిన్న ఇల్లా శ్రీనివాసరావు అనే యువకుడు హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున విజయవాడ వచ్చాడు. రామవరప్పాడు వెళ్లేందుకు లక్ష్మణ్ బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు. అతనిని తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
జమీర్ సోదరి పేరుతో కారు
బైక్‌ను ఢీ కొన్న కారు నంబర్ ఏపీ 39 సీఎల్ 0786 జమీర్ (zameer) సోదరి షేక్ నగీనా పేరుతో ఉంది. కారును జమీర్ వాడుతుంటాడు. 2020 సెప్టెంబర్ నుంచి ఈ ఏప్రిల్ వరకు 7 పెండింగ్ చలానాలు ఉన్నాయి. కారును జమీర్ బాషా నడుతుండగా ప్రమాదం జరిగిందని.. ఎమ్మెల్సీకి కారుతో సంబంధం లేదని విజయవాడ సెంట్రల్ జోన్ ఏసీపీ భాస్కర రావు తెలిపారు. కారులో మద్యం సీసాలు కూడా లేవని చెబుతున్నారు. అంతకుముందు మీడియా తీసిన ఫుటేజీలో బీర్ బాటిల్స్ కనిపించాయి.
అతను మా వాడే
జమీర్ (zameer basha) తమ మనిషి అని ఎమ్మెల్సీ రుహుల్లా చెప్పారు. తనకు 3 ఎమ్మెల్సీ స్టిక్కర్లు వస్తే వాటిలో ఒకటి జమీర్ కారుకు అంటించానని తెలిపారు. తర్వాత దానిని తొలగించామని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రుహుల్లా అనుచరులు స్టిక్కర్ తీసివేశారని తెలుస్తోంది. తమ కుటుంబానికి దిక్కేవరు తని లక్ష్మణ్ తల్లి మహేశ్వరి అడుగుతున్నారు. తమ ఒక్క ఆధారం అయిన కుమారుడు చనిపోయాడని విలపిస్తోంది.