ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మంత్రి రోజాపై అసత్య ప్రచారం కొనసాగుతోంది. రాబోవు ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వరని జోరుగా చర్చ సాగుతోంది. ఈ మేరకు సీఎం జగన్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై రోజా ఎట్టకేలకు స్పందించారు. తిరుమల శ్రీవారిని నేడు మంత్రి రోజా దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు.
మంత్రి రోజా మాట్లాడుతూ.. రాబోవు ఎన్నికలో రోజాకు టికెట్ రాదని కొంత మంది శునకానందంతో ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గడపగడపకూ మొదలుకొని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందు వరుసలో తానే ఉండటం వారికి కనపడలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తానని రోజా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కే సీట్లు లేకుండా రెండేసి నియోజకవర్గాలలో సర్వేలు చేయించుకుంటున్నారని చురకలంటించారు. తాను జగనన్న సైనికురాలినన, సీఎం జగన్ మాటే తనకు ముఖ్యమని అన్నారు.