ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ నెమ్మదిగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. కొందరు నేతలు ఆ పార్టీలో చేరారు కూడా. మరి కొందరు చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు జనాల పల్స్ ని బట్టి చేరాలా వద్దా అనేది ఆలోచిందామని అనుకుంటున్నారు. ఈ క్రమంలో… ఈ పార్టీ పై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు.
ఏపీలోకి బీఆర్ఎస్ రావటం మంచిదేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు వస్తే అంత మంచిదని, ఏపీలో కేఏ పాల్ పార్టీ కూడా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా అంటూ ఆసక్తికర ప్రశ్న వేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరక్కుండా కేసీఆర్ బీఆర్ఎస్ తరపున మద్దతు ఇస్తే మంచిదేనని సజ్జల అన్నారు. వైసీపీ కూడా ప్రైవేటీకరణ జరగకూడదనే కోరుకుంటోందని వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ ఏపీ విభాగం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఏపీకి చెందిన పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొడాలి నాని, పేర్ని నాని తదితరులు భారత రాష్ట్ర సమితి రాకను స్వాగతిస్తునే తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండదని తేల్చేశారు. కొత్త పార్టీ రాక అనేది ప్రజాస్వామ్యానికి మంచిదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు కేసీఆర్ను నమ్మరని తేల్చి పారేశారు.