తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకున్నంత అభిమానులు మరే స్టార్ హీరోకూ లేరనే చెప్పొచ్చు. మామూలుగానే ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. అలాంటిది ఈరోజు ఆయన పుట్టినరోజు ఇంకెంత జోష్ లో ఉంటారో చెప్పక్కర్లేదు. అయితే.. ఆ జోష్ కాస్త పక్కదారి పట్టి… విద్వంసానికి కారణమైంది. ఏకంగా ఓ థియేటర్ ని ధ్వంసం చేశారు. అసలు ఏం జరిగిందంటే…
నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు కూడా జరుపుతున్నారు.
ఇక గత కొన్ని రోజుల నుంచి అభిమాన హీరోలు పుట్టినరోజు వేడుకలకు ఆ హీరోలు కెరీయర్లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను తిరిగి విడుదల చేయడం ట్రెండ్ అవుతుంది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీని థియేటర్లో ఆయన నటించిన జల్సా సినిమాని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ప్రదర్శతమవుతున్న ఈ సినిమా చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలివచ్చారు. అయితే కొన్ని ప్రాంతాలలో అభిమానులు అత్యుత్సాహం చూపెడుతూ ఏకంగా థియేటర్లను ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు కర్నూలులో శ్రీరామ టాకీస్ లో జల్సా సినిమాని చూస్తున్నారు.ఈ థియేటర్లో సౌండ్ సిస్టం లో కొన్ని అవాంతరాలు ఏర్పడటంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో రచ్చ చేశారు.ఇలా సహనం కోల్పోయిన అభిమానులు ఏకంగా బయటకు వచ్చి థియేటర్ పై రాళ్లతో దాడి చేయగా థియేటర్లో ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది.ఇక విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి కొందరి అభిమానులను అదుపులోకి తీసుకుని పెద్ద ఎత్తున థియేటర్ ప్రాంతంలో బందోబస్తు నిర్వహించారు.