కడప జిల్లాలో అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి బయటకు రాకూడదని తెలిపారు. వృద్ధులు మహిళలు వికలాంగులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నది పరివాహక ప్రాంతాల్లో నీలకంఠేశ్వర స్వామికి కార్తీక మాసం 5వ రోజు పంచమి ఆదివారం అనేక ప్రాంతాల భక్తులు దర్శించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున నదీ సాన్నాన్ని ఆచరించి స్వామిని దర్శించి పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు స్వామివారికి పోలాలంకరణ చేపట్టారు.
SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని హడ్కో కాలనీలో ఆదివారం ఉదయం చేపట్టిన కార్డెన్ సెర్చ్‌లో భాగంగా 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ ఎం శ్రీనివాసరావు, ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే తమకు సమాచారం అందించాలని స్థానిక గ్రామస్తులకు సూచించారు.
TPT: జిల్లాకు ప్రత్యేక అధికారిగా అరుణ్ బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మొంథా తుఫాను నేపథ్యంలో కలెక్టర్‌కు సహాయ సహకారాలు అందించడానికి నియమించింది. తుఫాను కొరకు తిరుపతి జిల్లాకు రూ. రెండు కోట్లు వినియోగించుకోవాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
CTR: రానున్న మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో నివానది పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని DSPసాయినాథ్ సూచించారు. శనివారం రాత్రి నది సమీపంలో నివసిస్తున్న వారితో సమావేశం నిర్వహించారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలలోని వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. ఏవైన ఇబ్బందులు ఏర్పడితే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
E.G: కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రామాలయం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు హాజరై పడిపూజ కార్యక్రమానికి రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించారు. ముందుగా ఆయనకు గ్రామ పెద్దలు స్వాగతం పలికారు.
NLR: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమిద్ యాక్ట్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదర్సాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు.
VZM: నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థులు కళా ఉత్సవ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన పోటీల్లో వాయిద్య సంగీతం విభాగంలో ఈ పాఠశాల విద్యార్థులు తలాడ యువరాజు, మల్లారపు దుర్గాప్రసాద్, చింతపల్లి అజిత్, బంకపల్లి తేజ ప్రథమ స్థానంలో నిలిచారు.
GNTR: గుంటూరులో ఆదివారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220 కాగా, మటన్ ధర రూ.900 వద్ద స్థిరంగా ఉంది. చేపల మార్కెట్‌లో కొరమేను రూ.440, బొచ్చ రూ.220 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ వారం చేపలు కొనేందుకు నాన్-వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయే కామెంట్ చేయండి.
కోనసీమ: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట పోలీస్ డివిజన్ అధికారి సుంకర మురళీ మోహన్ సూచించారు. వచ్చే మూడు రోజులు చాలా కీలకమైనవని అన్నారు. తప్పనిసరి పనులు ఉంటేనే గానీ ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపారు. సముద్రం వద్దకు, గోదావరి వద్దకు వెళ్లకుండా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని ఆయన కోరారు.
ELR: జిల్లాలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRS కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు. మొంథా తుపాన్ హెచ్చరికల కారణంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
VSP: తవ్వి వదిలేసిన రోడ్లు ప్రజలకు కష్టసముద్రంగా మారాయి. వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్చరిక బోర్డులు, వన్‌వే సూచికలు లేక ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఆటోల్లో కుక్కుమనిపడి, కొందరు తోసుకుంటూ వెళ్లే పరిస్థితి. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
SKLM: సోంపేట మండలం పాలవలస గ్రామ సమీపంలో జాతీయరహదారి ఫ్లై ఓవర్‌పై లైట్లు వెలగక అంధకారం అలముకుంది. ప్లై ఓవర్ బ్రిడ్జి మీద ఒక వైపు సగం లైట్లు వెలుగుతున్నాయి. మరో వైపు పూర్తిగా వెలగకపోవడంతో చీకటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. సంబధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని చోదకులు కోరుతున్నారు.
VZM: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమని బొబ్బిలి రూరల్ సీఐ కె. నారాయణరావు అన్నారు. బాడంగి మండలం భీమవరంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
SKLM: మొంథా తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఈ తుపాను జిల్లాపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు.