VZM: జిల్లాలో అమలవుతున్న ‘జలధార-జలహారతి’ వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిని కలెక్టర్ ఛాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సవివరంగా చర్చించారు.
PPM: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న ‘వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్’ (JHS)ను మరో ఏడాది పాటు, అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డులో శనివారం జనగణనపై ప్రజలకు క్షేత్రస్థాయిలో కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పరిశీలించారు. ఇంటింటికి తిరుగుతూ జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి, వివరాలు నమోదు చేసి ఇంట్లో జాబితా రూపొందిస్తున్నారని వివరించారు.
BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్టలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు వ్యక్తిని వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. తీవ్ర రక్తస్రావమై, క్షతగాత్రుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AKP: గొలుగొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శనివారం గ్రామంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణమూర్తి, సహాయ ఉపాధ్యాయులు విజయలక్ష్మి, స్కూల్ కమిటీ ఛైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు. గ్రామంలో విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులను తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు.
VZM: జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. పూలే సమాజం కోసం అనేక పనులు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్బంగా పూలేను స్పూర్తిగా తీసుకIని ఆయన అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.
W.G: తాడేపల్లిగూడెంలో తాటి ముంజెలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా పశ్చిమలో ముంజెలకు మే మొదటి వారంలో మార్కెట్‌కు అమ్మకానికి వస్తాయి. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందు గానే తాటి మంజులు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే వీటి ధర అదరహో అన్నట్లుగా ఉంది. డజను ముంజెలు రూ.80 వరకు పలుకుతున్నాయి. అయినా వీటిని కొనేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు.
VSP: గాజువాక 75వ వార్డ్ చిన కోరాడ SC కాలనీలో ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ SC/ST యోజన’ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, అందరూ వినియోగించుకోవాలని సూచించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని తెలిపారు. పెద గంట్యాడ మండలంలో సుమారు 350 మంది అర్హులుగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
E.G: ఉండ్రాజవరం బౌద్ధ పీఠం వద్ద జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా సంయుక్త కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఆయన మాట్లాడుతూ…. సమాజంలోని అసమానతలను తొలగించి, మహిళా విద్యకు మార్గం చూపిన గొప్ప మహానుభావుడిగా పూలేను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను పాటించాలన్నారు.
KRNL: ఆస్పరి మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇవాళ MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వారాలకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణం లేదా హంద్రీ నీవా కాల్వ నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.
CTR: వెదురుకుప్పం మండలంలోని రైతు భరోసా కేంద్రంలో హార్టికల్చర్ అధికారి లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో మామిడి కవర్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవర్ ధరలో ప్రభుత్వం ఒక రూపాయి సబ్సిడీ అందిస్తుందని, రైతులు ఒక్క రూపాయి చెల్లించి కవర్లు పొందవచ్చని తెలిపారు.
KDP: ఓబులవారిపల్లి మండలం పెద్ద ఓరంపాడు పంచాయతీ బెస్తపల్లి గ్రామంలో వ్యవసాయ నష్టంతో సారా సురేష్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటలు విఫలమవడంతో అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతను పొలంలో పురుగుల మందు సేవించాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
మార్కాపురం పట్టణంలోని ఓ హోటల్‌లో పేకాట ఆడుతున్న 17 మందిని శనివారం స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.63,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ ప్రగతి పండుగల్లో భాగంగా కనేకల్లు మండలం ఎన్. హనుమాపురం గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి పైపులైన్‌ను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. గతంలో నీటి ఎద్దడి ఎదుర్కొన్న ఈ గ్రామానికి శాశ్వత పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.
కోనసీమ: రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలపై 48 అర్జీలు అందించారు. మంత్రి వాటిని శ్రద్ధగా స్వీకరించి, అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూస్తానన్నారు.