GNTR: కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ నాయబ్ రసూల్, ఎస్సైలు ఆనంద్, ప్రసాద్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
సత్యసాయి: CM చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం పురస్కరించుకుని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చంద్రబాబు పేరు మీద ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ 76 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
NDL: బనగానపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆదివారం ఆళ్లగడ్డ నూతన డీఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి డీఎస్పీని అభినందిస్తూ, విధుల్లో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.
PLD: మాచర్ల నియోజకవర్గం తాళ్లపల్లి జడ్పీ పాఠశాలలో రూ.30 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్‌ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డితో కలిసి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి హామీల అమలు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
KRNL: పెద్దకడబూరులోని టీడీపీ రైతు విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్వగృహం వద్ద సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటం వద్ద టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.
NDL: బనగానపల్లెలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు కష్టపడే తత్వం, క్రమశిక్షణ, దూరదృష్టితో కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. విజనరీ నాయకుడైన ఆయన సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
W.G: నరసాపురం నివసించే సుధారాణి ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. ఆదివారం ఆమె గుడికి వెళ్లిన సమయంలో దుండగులు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని 4 కాసుల బంగారం, 18 తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితురాలు తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
SKLM: ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం RIO ఆర్. సురేశ్ కుమార్ ఇవాళ తెలిపారు. ఈ నెల 27 వ తేదీ లోపు ఫీజులు చెల్లించాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులు, అలాగే ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VSP: విశాఖపట్నం రామా టాకీస్ సమీపంలోని ఎక్సైజ్ ప్రీమియం స్టోర్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర సోమవారం తనిఖీ చేశారు. స్టోర్‌లోని మౌలిక సదుపాయాలు, బిల్లింగ్ ప్రక్రియతో పాటు ‘ఎక్సైజ్ సురక్ష’ యాప్ వినియోగాన్ని నిశితంగా పరిశీలించారు. శాఖను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, రకాల నాణ్యమైన మద్యం బ్రాండ్లను ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు.
CTR: పుంగనూరు పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ కూడలిలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. AMC చైర్మన్ సెమీ పతి యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ అందరి మన్నలను అందుకుంటున్న గొప్ప నాయకుడు చంద్రబాబు అన్నారు.
CTR: పూతలపట్టు మండలం పాలకూరు గ్రామంలో చెత్త సేకరణ కార్యక్రమాన్ని సెక్రటరీ లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ.. నేటి నుంచి ప్రభుత్వం తరఫున ఐవిఆర్ఎస్ కాల్స్ వస్తాయని తెలిపారు. కాల్స్ వచ్చినప్పుడు స్పందించి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ప్రజల సూచనలు సేవల మెరుగుదలకు ఉపయోగపడతాయని ఆమె వివరించారు.
సత్యసాయి: నల్లచెరువు మండల పరిధిలోని దేవిరెడ్డిపల్లి ఆదర్శ పాఠశాల సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ద్విచక్ర వాహనాన్ని టాటా ఏసీ వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో గాయపడిన వ్యక్తి నల్లచెరువుకు చెందిన నాగభూషణగా స్థానికులు గుర్తించారు. 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవం పర్వదినాన ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు స్వామివారిని మొదటిగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరారు. దర్శించిన వారిలో MLA అదితి గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు ఉన్నారు.
ప్రకాశం: చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలలో భాగంగా మంత్రి స్వామి పొన్నలూరులో స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు విజనరీ లీడర్‌గా గుర్తింపు పొందారు. పడిన ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసిపడే నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా ఆయన నిలిచారన్నారు. ఆధునిక సాంకేతికతను రాజకీయంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు.