NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారికి పౌర్ణమి పూజలను శనివారం వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవను చేశారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఉన్న యాగశాల నందు చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు చేశారు.
TPT: ఈనెల 14వ తేదీ సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జిల్లా కేంద్రానికి, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాలకు రావద్దని ఆయన సూచించారు.
TPT: ఈనెల 14న బీఆర్ అంబేద్కర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం సంధర్బంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో పోలీస్ కార్యాలయంలో నిర్వహించే PGRSకు రావొద్దని తెలిపారు.
CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధిలో వెలసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా స్వామివారి రథోత్సవం జరిగింది. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ:శివాయ అంటూ రథాన్ని ముందుకు లాగారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో నేడు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 70% ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 84% బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలను ప్రిన్సిపల్ హసీనా బేగం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ఉత్తీర్ణులైన బాలికలు భవిష్యత్తులో కూడా ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆమె కోరారు.
ప్రకాశం: దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో శనివారం శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణా: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడమే లక్ష్యంగా కొల్లు ఫౌండేషన్ పని చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు, జనసేన ఇంఛార్జ్ బండి రామకృష్ణతో కలిసి మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. వేసవిలో పాదచారుల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
BPT: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాకు చెందిన మాచవరపు రవి కుమార్‌ను రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా నియమించారు. షేక్ పర్వేజ్‌ను రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శిగా, ఎమానుయేల్ రెబ్బాను రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ సెల్ కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాలను పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది.
NTR: చందర్లపాడు మండలం ముప్పాళ్ళలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఈ నెల 13వ తేదీ జరుగనున్నాయని పాఠశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి 12 గం.ల వరకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గం.ల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.
కృష్ణా: ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ వద్ద శనివారం బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడంతో ఆకుల గణేశ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. డబ్బులు అడుగగా గణేశ్ లేవని చెప్పడంతో దుండుగులు అతడిపై బ్లేడుతో, పక్కనున్న వారిపై కర్రలతో దాడి చేశారు. గాయాలతో పడి ఉన్న గణేశ్‌ను 108 వాహనంలో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయనకు స్వాగతం పలికారు. డీజీపీతో కలిసి ఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు.
KRNL: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాకు విచ్చేసిన ఆయనకు ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. గుంతల రహిత రహదారుల పనులను సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి బీసీ అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపు విషయంలో జాప్యం జరగకుండా చూస్తామన్నారు.
ATP: 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనంతపురం జిల్లాలో స్వయం ఉపాధి పథకానికి 477 మంది లబ్ధిదారులకు రూ.11.61 కోట్ల మెగా చెక్కును ఎంపీ అంబికా నారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అందజేశారు. స్వయం ఉపాధి పథకానికి సంబంధించి మండలాల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, చెక్కులు అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని తారాపురంలో వెలసిన శ్రీ గిడ్డాంజనేయస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి జలాభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
SKLM: నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు చిన్నికృష్ణ ఆధ్వర్యంలో శనివారం అడ్మిషన్ డ్రైవ్ చేపట్టారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలు కలిగిన విద్య అందుతుందని చెప్పారు.