PLD: సత్తెనపల్లి కాకతీయ కల్యాణ మండపంలో నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ అరుణ్ బాబు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. లక్కరాజు గార్లపాడు రోడ్డు బ్రిడ్జి, నందిగామ బ్రిడ్జి నిర్మాణాలపై చర్చించారు. మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కృష్ణా: భారత సాయుధ దళాల పట్ల గర్వంగా ఉందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పహాల్గాంలో అమాయకులపై దాడికి జవాబే ఆపరేషన్ సింధూర్ అని పేర్కొన్నారు. దేశంపై దాడికి జవాబు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
VZM: విజయనగరంలో గల ఘోషా ఆసుపత్రిని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఘోష ఆసుపత్రి మరియు జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని, ఆసుపత్రులలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.
NTR: విజయవాడ విద్యుత్ సౌధ వద్ద సీపీఎం ధర్నాతో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ధర్నాలో సీపీఎం నేతలు సిహెచ్. బాబూరావు, దోనేపూడి కాశీనాథ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ భారాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని నినాదాలు చేస్తూ..అదానీ ఒప్పందాలు రద్దు చేయాలని అదానీ ఫ్లెక్సీ దహనం చేసేందుకు యత్నించారు.
ASR: యుద్ధ సమయంలో మనందరం సివిల్ డ్రెస్‌లో ఉన్న సైన్యంలా విధులు నిర్వహించి, ప్రజలను రక్షించే భాద్యత చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో మాక్ డ్రిల్ పై సమావేశమయ్యారు. పహల్గాంలో జరిగిన ఘటన నేపధ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధం నెలకొనే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో, యుద్ధం సంభవిస్తే ఎదుర్కొనే విధానాలు గురించి చర్చించారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండల ఇన్‌ఛార్జ్ తహసీల్దారుగా వేల్పుల రాజసింహ నరేంద్ర బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఇన్‌ఛార్జ్ తహసీల్దారు రెవిన్యూ అధికారులతో వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఉత్సవాల్లో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
GNTR: నగరంలోని నాజ్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె.యస్ లక్ష్మణరావు పాల్గొని విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారామరాజు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రకృతి వనాలపై జరుగుతున్న మైనింగ్ దోపిడికి యువత అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని బుధవారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద సంబేపల్లి మండలం, నారాయణరెడ్డి పల్లె మంచాలమ్మ తిరునాళ్లకు రావాలని నారాయణరెడ్డిపల్లె గ్రామ ప్రజలు మరియు టీడీపీ నాయకులు మంత్రివర్యులను కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచాలమ్మ తిరునాళ్లకు తప్పక హాజరవుతానన్నారు.
ATP: తాడిపత్రిలోని కడప రోడ్డు బైపాస్‌లో వాసవి మాత విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్స కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
KKD: పెద్దాపురంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. బుధవారం మహారాణి కాలేజీలో అండర్-12, 14, 16 వయస్సు గ్రూప్ బాల బాలికలకు పోటీలు నిర్వహించారు.100 మీటర్ల లాంగ్ జంప్, షాట్ పూట్ క్రీడా పోటీలు జరిగాయి. విజేతలకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం బహుమతులు అందజేశారు.
SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దాడ లత తెలిపారు. బుధవారం ఆమె పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల తొమ్మిదవ తేదీన నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా చేపడుతున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు. అర్హత కలిగిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ASR: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా డుంబ్రిగుడలో అల్లూరి విగ్రహానికి స్థానిక అల్లూరి యూత్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై అల్లూరి అంటూ నినాదాలు చేశారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం 27ఏళ్ల వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సూర్య, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
SKLM: విద్యుత్ కొనుగోలు పేరుతో ప్రజలపై అదనపు భారం మోపేలా కుదుర్చుకున్న యాక్సిస్ ఎనర్జీ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని వైసీపీ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పెరిగిన ట్రూ-అప్ ఛార్జీలు, ఎఫ్‌పిపిసిఎ వంటి వాటితో సామాన్యులు తీవ్రంగా నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
E.G: మన్యం వీరుడు స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా క్షత్రియ సామాజిక వర్గం ఆధ్వర్యంలో రామాలయం జంక్షన్‌లో బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. MLA మాట్లాడుతూ .. స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని దాని కోసం ప్రాణాలర్పించిన యోధుడు అని తెలిపారు.
కృష్ణా: ఇసుక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడిన ఘటన బందరు మండలం చిట్టిపాలెం వద్ద బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పరిమితికి మించిన బరువుతో ఇసుక రవాణా చేపట్టడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.