NDL: బనగానపల్లె మండలం, నందవరం గ్రామంలోని చౌడేశ్వరి దేవి అమ్మవారికి సోమవారం పౌర్ణమి పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలోని యోగశాలనందు అర్చకులు చండీ హోమం పూజలు చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి సాయంత్రం పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
NDL: నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో సంక్రాంతి పండగ సందర్బంగా ఏర్పాటు చేసిన కబడ్డీ క్రీడను నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య, సున్నంపల్లి శ్రీనివాసులు, పురుషోత్తం రెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
విజయనగరం: భోగి మంటలతో సమస్యలు దహనమవ్వాలని కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం ఇంఛార్జ్ బత్తిన మోహన్ రావు అన్నారు. సోమవారం పట్టణ మెయిన్ రోడ్డులో వేసిన భోగిమంటల్లో పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, కోలా కిరణ్, సాయి శివ తదితరులతో కలిసి జిల్లాను వేధిస్తున్న సమస్యల వినత పత్రాన్ని దహనం చేశారు. ఈ భోగి మంటలతో అవి దహనమయ్యేలా పాలకులు, అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
విశాఖ: సింహాచలంలో కనుమ పండుగ పురస్కరించుకొని ఈనెల 15వ తేదీన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గజేంద్రమోక్ష ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరోజు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు సోమవారం పేర్కొన్నారు. అనంతరం స్వామివారిని గ్రామపురవీధుల్లో తిరువీధోత్సవం నిర్వహించనున్నారు.
PPM: వైసీపీ సీనియర్ నాయకులు, సంఘ సేవకులు, విస్ డమ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కేతిరెడ్డి రాఘవ కుమార్ సంక్రాంతి పండగ, వారి తల్లిదండ్రులు స్వామి నాయుడు సావిత్రమ్మ జ్ఞాపకార్థంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 సం.విద్యార్థులకు ఉచిత విద్యను అందించి పేదలకు వైద్య సహాయం అందించటం, మొక్కలు నాటించడం చేస్తున్నామని తెలిపారు.
NDL: 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా ఏఎస్పీగా మందా జావళి ఆల్ఫోన్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లాలో ట్రైనీ IPSగా మందా జావళి శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
నెల్లూరు: గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై సోమవారం బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు చేవూరు వద్ద మోటర్ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, కారులో పయనిస్తున్న అధ్విక రాజ్ అనే పాప అక్కడికక్కడే మృతి చెందారు.
VZM: డెంకాడ మండలం చొల్లంగిపేట గ్రామంలోని రచ్చబండ వద్ద పేకాట స్థావరంపై ఎస్సై సన్యాసినాయుడు తన సిబ్బందితో కలిసి సోమవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 5,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
AKP: అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో గల రసూల్ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము తెలిపారు. చెయ్యి పూర్తిగా దెబ్బ తినడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పరిశ్రమల యజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికి వదిలేసినట్లు విమర్శించారు.
NDL: బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు సోమవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 16 వరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. నియోజకవర్గ ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఎవరు క్యాంపు కార్యాలయానికి రావద్దని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
విశాఖ: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నక్కపల్లి మండలం సారిపల్లివానిపాలెం క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం మాస్ గెటప్‌లో ఫొటోకు ఫోజులు ఇచ్చారు. నెత్తిపై తలపాగా, కూలింగ్ అద్దాలు, పందెం కోడిపుంజు పట్టుకుని ఫొటో దిగారు. అభిమానులు పార్టీ శ్రేణుల కోరిక మేరకు ఆమె కాసేపు ఈ విధంగా మాస్ గెటప్‌లో కనిపించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంలో పయనించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ కోరుకున్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రజలకు, అధికారులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని దేవున్ని వేడుకున్నారు.
నెల్లూరు: భోగి పండగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు నరసింహకొండకు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
విశాఖ: రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విశాఖ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ప్రియాంక దండి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ పరిధిలో ఇసుకతోట వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉందన్నారు.
KRNL: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం కర్నూలు నగరంలో స్థానిక ఔట్ డోర్ స్టేడియంలో డీవీఆర్ సంస్థ ఆధ్వర్యంలో 1,000 మంది మహిళలతో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి టీజీ రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు ప్రధానం చేశారు.