NDL: ఆళ్లగడ్డలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య పుష్ప (35)ను భర్త చెన్నయ్య కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఇంట్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఆయన, అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: గుత్తులపుట్టు నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్న 33 కేవీలైన్ మర మ్మతులు చేసేందుకు శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ వేణుగోపాల్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
PPM: గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో పామాయిల్ తోటలో గురువారం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అటువైపుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ నిరంతరం ఏనుగుల కదలికలను గమనిస్తూప్రజలను అప్రమత్తం చేస్తుంటారని, ప్రజలు కూడా సహకరించాలని ఫారెస్ట్ అధికారులు కోరారు.
TPT: వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అకోలా, చర్లపల్లి నుంచి తిరుపతికి పలు స్పెషల్ రైలు సర్వీసులను మరికొద్ది రోజులు పొడగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 8 వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATP: గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో వీర బ్రహ్మేంద్ర స్వామి తిరుణాలలో భాగంగా శుక్రవారం మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసక్తి గల క్రీడాకారులు ఇవాళ సాయంకాలం లోపు రూ. 500 ఎంట్రీ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
VZM: రాజాం పట్టణంలోని డోలపేట, పురుషోత్తపురం రెండో లైన్ మార్గంలో ఉన్న కాలువపై పలకలు మరమ్మతుల నిమిత్తం తొలగించిన పురపాలిక సిబ్బంది, వాటిని పూర్తిగా పునరుద్ధరించకుండా వదిలేశారు. ఇటీవల ఒకవైపు కొంతమేర పలకలు అమర్చినా, మిగతా భాగం అలాగే ఉండడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రకాశం: త్రిపురాంతకం మండలం ధూపడు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను పగలగొట్టి రాగి వైరు చోరీ చేశారు. సాగర్ వాటర్ పంప్ హౌస్‌కు ఇదే ట్రాన్స్ ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో ఆ ప్రాంతంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
SKLM: శ్రీకాకుళం జిల్లా హిరమండలం పంచాయతీలోని గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని పంచాయతీ ఇంచార్జ్ ఈవో సాయిప్రసాద్ బుధవారం ప్రకటనలో తెలిపారు. రక్షిత నీటి పథకాల మోటార్లు మరమ్మతులకు గురయ్యాయని, పలుచోట్ల పైపులైన్లు పాడవటం తో బాగు చేస్తున్నట్లు చెప్పారు. అంతవరకు ట్యాంకర్ల తో నీరు సరఫరా చేస్తామన్నారు.
కృష్ణా: బంటుమిల్లి మండల డంపింగ్ యార్డ్‌ను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించి, వ్యర్థాల నిర్వహణ విధానంపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్‌లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచడం, చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్నారు.
KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో బుక్ కీపర్లకు డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి 140 మొబైల్ ఫోన్లు బుధవారం పంపిణీ చేశారు. గ్రామస్థాయిలో సేవల వేగం, పారదర్శకత పెంపే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, బుక్ కీపర్లు పాల్గొన్నారు.
CTR: శ్రీరంగరాజపురంలో నిర్వహిస్తున్న ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజు స్వామి ఆలయ మహాభారత వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన అర్జున తపస్సు భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అర్జున తపస్మాన్ వద్దకు చేరుకున్న అర్జున వేషధారి పద్యాలు ఆలపిస్తూ తపస్మాన్‌ను అధిరోహించాడు.
సత్యసాయి: సింగపూర్ అధికారిక పర్యటనలో భాగంగా మూడవ రోజు మంత్రి సత్యకుమార్ యాదవ్ బృందం పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీని సందర్శించింది. ఓడరేవులో వినియోగిస్తున్న ఆటోమేటెడ్ వాహనాలు, రిమోట్ కంట్రోల్ క్రేన్ల పనితీరును వారు పరిశీలించారు. పర్యావరణహిత విద్యుత్ యంత్రాల వాడకం, వేగవంతమైన కంటైనర్ లోడింగ్ ప్రక్రియను నిశితంగా అధ్యయనం చేశారు.
ELR: ఉమ్మడి జిల్లాలలో ఉన్న మసీదులను ఈనెల 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ MD కరీముల్లా తెలిపారు. మసీదు మేనేజ్‌మెంట్ కమిటీలు, వేతనం పొందుతున్న ఇమామ్‌లు, మౌజన్లు, తమ మసీదుల రిజిస్ట్రేషన్ కొరకు ఏలూరు కలెక్టరేట్లో వక్స్ బోర్డు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాల కొరకు 9985941119 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలోని నక్కలదిన్నె తండాలో కోడలిపై అత్తమామలు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. రూ.7 లక్షలు, 30 గ్రాముల బంగారం ఇచ్చిన డబ్బు తిరిగి అడగడంతో దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. దాడిలో గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
NLR: ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు టిక్కెట్లు కొట్టే మిషన్ పనిచేయక రోడ్డుపైనే ఆగిపోయింది. కావలికి వెళ్తున్న ఈ బస్సులో ఎక్కిన ప్యాసింజర్లకు టికెట్లు కొట్టే సమయంలో మిషన్ పనిచేయలేదు. దీంతో టిక్కెట్లు కొట్టే వీలు లేక వింజమూరు సమీపంలో బస్సును అక్కడే నిలిపివేశారు. బస్సు కండక్టర్ డిపో అధికారులను సంప్రదించగా.. మాన్యువల్ టికెట్‌తో బస్సు బయలుదేరింది.