W.G: నరసాపురం-మాధవాయి పాలెం ఫెర్రీ వేలం పాట వాయిదా పడింది. స్థానిక MPDO కార్యాలయంలో గురువారం నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ అనివార్య కారణాల వల్ల నిలిపివేసినట్లు జాయింట్ కమిటీ సభ్యులు తెలిపారు. MPDO అనారోగ్యానికి గురవ్వడం, జిల్లా పరిషత్ CEO అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి వేలం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులోని RCM చర్చిలో యేసు తిరు హృదయ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభయాయాయి. మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఫాదర్ మోలుగుమాటి ప్రకాష్ పాల్గొని యేసు తిరు హృదయ విశిష్టను విశ్వాసులకు వివరించారు. ఆనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
CTR: పుంగనూరులో హనుమంతరాయుని దిన్నె శ్రీ వీరాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను వేదపండితులు అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజపటాన్ని ఎగురవేశారు.
ASR: హుకుంపేట మండలం పెద్దగరువు టోల్ గేట్ వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. తెడబారికి సురేష్ కుమార్ సంబంధిత అధికారులకు గురువారం వినతిపత్రం సమర్పించారు. 60 కిలోమీటర్ల పరిధిలోని స్థానిక వాహనదారులకు లోకల్ ప్రీ పాస్ లేదా ఆధార్ ఆధారంగా టోల్ మినహాయింపు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆదాయ వృద్ధిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మున్సిపల్, పంచాయతీరాజ్ పనుల్లో తప్పనిసరిగా జీఎస్టీ అమలు చేయాలని ఆదేశించారు.
VSP: మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV టీకా పంపిణీ, అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఎంతగానో దోహదపడుతుందని, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి చైతన్యం కల్పించాలని గంటా రవితేజ సూచించారు. వ్యాక్సిన్ నిల్వలు, పంపిణీ తీరుపై వైద్యాధికారిణి డాక్టర్ దీపికను అడిగి తెలుసుకున్నారు.
NLR: జిల్లాకు నూతనంగా 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలు మంజూరైనట్లు జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పశుసంవర్థకశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలను త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
W.G: తాడేపల్లిగూడెం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర రావు విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2 లక్షల 32 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని ఆయన తెలిపారు. ఈ మేరకు 9 లక్షల 57 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి రానుందని అంచనా వేసామన్నారు. జిల్లాలో 7 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల దాన్యం సేకరించాలని తెలిపారు.
AKP: రైతులు సమీకృత వ్యవసాయ విధానాన్ని పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీహరి, ప్రసాద్ సూచించారు. గురువారం రాంబిల్లి మండలం వెంకటాపురం కృషి విజ్ఞాన కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా పచ్చిరొట్ట ఎరువుల ఆవశ్యకత, చౌడు భూముల యాజమాన్యం పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఉమా ప్రసాద్ పాల్గొన్నారు.
VZM: పీసీ & పీఎన్‌డీటీ చట్టం అమలుపై స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏవో ఆర్. ఈశ్వరమ్మ అధ్యక్షతన గురువారం సమీక్షా సమావేశం జరిగింది. డివిజనల్ స్థాయి కమిటీ అధికారులతో కలిసి చట్ట అమలు, తీసుకుంటున్న చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పీఎన్‌డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
GNTR: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, యువతకు పిలుపునిచ్చారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రారంభంలో చిన్న మొత్తాలతో మొదలై, తర్వాత పెద్ద నష్టాలకు దారి తీస్తాయని తెలిపారు.
సత్యసాయి: నల్లమాడ మండలం కొండ్రువారిపల్లికి చెందిన మీనాక్షి(19) అదృశ్యంపై నమోదైన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. సంతకు వెళ్లి తిరిగి రాని యువతి ఆచూకీని పోలీసులు చాకచక్యంగా గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
KKD: నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత గురువారం సాయంత్రం వైసీపీ శ్రేణులతో ‘చాయ్ విత్ పోతవరం కేడర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
E.G: పేదరికాన్ని జయించి గ్రూప్-2 ద్వారా ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికైన కడియం మండలం దామిరెడ్డిపల్లికి చెందిన చింతపర్తి దీప్తి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ అమ్మాయికి పెద్దాపురం సర్కిల్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు దీప్తి ఎక్సైజ్ సీఐకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి బాధ్యతలు స్వీకరించారు. విద్య వాలంటీర్‌గా పనిచేస్తూ కష్టపడి చదువుకుని విజయాన్ని సాధించారు.
ASR: గూడెం కొత్తవీధి మండలం సీలేరులో గురువారం రంపచోడవరం ఓఎస్‌డీ పంకజ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీలేరులో నూతనంగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్ భవనాన్ని తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు.