ATP: పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుంటూరు విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనకు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.
NLR: గుడ్లూరు మండలం సాలిపేట-రావూరు మార్గంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చేవూరుకు చెందిన సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. బుధవారం ఎస్ఐ వెంకట్రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్కూల్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.
BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలోకి గ్యాస్ సిలిండర్లతో వ్యాన్ రాగానే సిలిండర్ల కోసం ప్రజలు భారీగా గుమిగూడి తోపులాటకు దిగారు. ఒక్కసారిగా అందరూ బండి వద్దకు రావడంతో కొంతసేపు గందరగోళం చోటుచేసుకుంది. గ్యాస్ కొరత లేకపోయినా సరఫరా సక్రమంగా జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
GNTR: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కుమార్తె వివాహం బుధవారం గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై వధూవరులు నాగసాయి వైదీప్తి-కెవిన్ రామ్‌కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.
NTR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లీగల్ మెట్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇగ్నైట్ సెల్’ కార్యక్రమం నిర్వహించారు. కొలతల ప్రమాణాలు, వినియోగదారుల హక్కులపై అవగాహన పెంపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా పారదర్శక వాణిజ్యం, న్యాయమైన లావాదేవీలకు తోడ్పాటు లభిస్తుందని అధికారులు తెలిపారు.
VSP: భీమిలి జోనల్ కార్యాలయం పరిధిలోని మార్కెట్లలో ఆశీలు వసూళ్లకు 26న వేలం నిర్వహిస్తున్నట్లు జోనల్ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. భీమిలి రోడ్డు మార్జిన్, ఎల్.బీ. శాస్త్రి మార్కెట్, కలిగొట్ల సూర్యనారాయణ మార్కెట్, తగరపువలస, చిట్టివలస రోడ్డు మార్జిన్‌లో ఆశీలు వసూళ్లకు ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం జరుగుతుందని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కి ఏఐవైఎఫ్ శ్రీకాకుళం టౌన్ కన్వీనర్ వేణు నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి వినతి పత్రం బుధవారం అందజేశారు. లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగు లక్షల ఉద్యోగాలు, రూ. 3000 నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చాలని కోరారు.
SKLM: డాక్టర్ కంబపు సూర్యారావుకి ఆంధ్ర విశ్వవిద్యాలయం PHD ప్రదానం చేసింది. “ఎంపిక చేసిన భారతీయ రాష్ట్రాలలో ప్రజారోగ్యం వ్యయం యొక్క ప్రభావం” అనే అంశంపై పరిశోధన చేశారు. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉండటం వల్ల గృహ వినియోగంలో ఆరోగ్యానికి కేటాయింపులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బుధవారం శ్రీకాకుళంలో ఆయన తెలిపారు.
CTR: హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిదంటూ కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అలాంటి సమస్య ఎక్కడా లేదని పలువురు బంకు ఓనర్లు పేర్కొన్నారు. జిల్లాలో 60 రోజులకు పైగా సరిపడా నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా డీజిల్ సరఫరా లేటు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో సమస్యలు ఉన్నాయన్నారు.
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి సవితను పలువురు కూటమి నాయకులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సందర్శకులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను మంత్రికి విన్నవిస్తూ వినతిపత్రాలు అందజేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి, వాటి పరిష్కారానికి తగిన కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
AKP: నర్సీపట్నంలోని ట్రాక్టర్ షోరూమ్‌లో జరిగిన ప్రమాదంలో ఈదల అశోక్ తేజ అనే యువకుడు మృతి చెందాడు. మెకానిక్‌గా పనిచేస్తూ ట్రాక్టర్ కింద ఉండి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా, గేర్లో ఉన్న వాహనం కదలడంతో వెనుక టైర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించినట్లు పోలీసులు తెలిపారు.
నెల్లూరు సిటీ 8వ డివిజన్ హిమాలయ స్కూల్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేషన్ కమిషనర్ వైవో. నందన్ బుధవారం పర్య టించారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఆక్రమణకు గురైన డ్రైనేజీ కాలువను టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆక్రమణల తొలగింపుపై తదుపరి చర్యలు తీసుకోవాలని సర్వేయర్, ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని హైకోర్టు న్యాయమూర్త సి.డి.శేఖర్ బుధవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, కార్యనిర్వహణాధికారి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.
VZM: బొబ్బిలి పట్టణంలోని మురుగునీటి కాలువలు కంపు కొడుతున్నాయి. కాలువలలో పూడికలు పేరుకుపోయి మురుగునీరు సక్రమంగా ప్రవహించకపోవడంతో కాలువలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. జంగాల శివాలయం వీధి సమీపంలోని కాలువలు కంపు కొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛ బొబ్బిలిని చెత్త బొబ్బిలిగా మారుస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TPT: శ్రీ సిటీ పరిధిలోని ఇరుగుళం గ్రామంలో ఎస్సై ప్రియాంక ఆధ్వర్యంలో ఉచిత కంటి, దంత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ సంస్థల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు, చికిత్సలు పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచుతాయని తెలిపారు.