»Nara Lokesh Who Invited Ycp Members To Tdp Promised To Support The Student
Nara Lokesh: వైసీపీ సభ్యులను టీడీపీలోకి ఆహ్వానించిన నారా లోకేష్..విద్యార్థిని ఆదుకుంటానని హామీ
టీడీపీ నేత నేడు యువగళం పాదయాత్రలో భాగంగా అమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులతో, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీ అగ్రనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపడుతున్న యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) కోనసీమ జిల్లాల్లో సాగుతోంది. ఈ తరుణంలో నేడు ఆక్వా రైతులతో నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..ఆక్వా రైతులను వైసీపీ సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. వారిని ఆ రాష్ట్ర పాలకులు దారుణంగా మోసం చేశారన్నారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులను (Aqua Farmers) ఆదుకుంటుందన్నారు. సీడ్, ఫీడ్, కరెంట్ ఛార్జీలల్లో ఏ సమస్యలు వచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. ఆక్వా రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా చంద్రబాబు పాలన ఉంటుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు ఏ సమస్యా లేకుండా చూస్తుందని, బాబు పాలనలో రాష్ట్రం ప్రతి రంగంలో ముందడుగు వేస్తుందన్నారు.
యువగళం పాదయాత్ర నేడు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కొనసాగగా రైతులు, పేదలతో నారా లోకేష్ ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతుల పూడి సభ్యులు టీడీపీలో చేరారు. వారికి నారా లోకేష్ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే భట్నపల్లిలోని యువతతో నారా లోకేష్ భేటీ అయ్యి వారి సమస్యలు తెలుసుకున్నారు. పాదయాత్రలో అమలాపురం నియోజకవర్గంలోని కోడుపాడుకు చెందిన విద్యార్థి దుర్గారెడ్డి (Student durga reddy) తన సమస్యను తెలిపాడు.
తాను అమలాపురంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఇంటర్ హెచ్ఈసీ గ్రూపులో జాయిన్ అయ్యానని, అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవని, అందుకే చదువు మానేశానని తెలిపాడు. ఆ తర్వాత ఐటీఐ చదువుదామని చూస్తే తన తండ్రికి స్థోమత లేక చదివించలేదన్నారు. అందుకే టీసీ తీసుకుని ఇంటి వద్దే ఉంటున్నట్లు తెలిపాడు. విద్యార్థి దుర్గారెడ్డిని చూసి చలించిపోయిన నారా లోకేష్ ఆర్థికంగా సాయం చేస్తానన్నారు. ఆ విద్యార్థిని చదివిస్తానని హామీ ఇచ్చారు. దీంతో నారా లోకేష్‌పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.