ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 28 ఏపీట్రాన్స్కో సబ్స్టేషన్లు, కడపలో 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అయితే 12 సబ్స్టేషన్లను ప్రారంభించగా..సోలార్ పవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అయితే ఒకే సమయంలో ఇన్ని విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు జరగడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. విద్యుత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని, పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం ఈ సందర్భంగా సూచించారు. రూ.6,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 28 APTransco సబ్స్టేషన్లలో 16 శంకుస్థాపనలు, 12 ప్రారంభోత్సవాలు ఉన్నాయి.
రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ దృష్ట్యా, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. వీటి ఏర్పాటు ద్వారా వచ్చే 25 ఏళ్లకు అవసరాలు తీరుతాయని అన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, సరఫరా నాణ్యత సహా నమ్మకమైన విద్యుత్తును 24×7 సరఫరా చేయడానికి AP ప్రభుత్వం సిద్ధంగా ఉందని జగన్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, AP రాబోయే రోజుల్లో గణనీయమైన వృద్ధిని, పట్టణీకరణను చూస్తుందన్నారు. ఇది విద్యుత్ డిమాండ్(power demand)ను అనేక రెట్లు పెంచుతుంది. ఆ క్రమంలో 24×7 నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కేంద్రీకృత విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం అవసరమని సీఎం గుర్తు చేశారు.
24×7 నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం మొత్తం నెట్వర్క్(network)ను బలోపేతం చేయడంలో భాగంగా కర్నూలు, నంద్యాల, కడపలో 28 చోట్ల 132/33 kV, 220/132 kV, 400/220 kV, 400/132 kV వివిధ సామర్థ్యాల సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
సోలార్ ప్రాజెక్టుకు కడప జిల్లా మైలవరం మండలంలో 1000 మెగావాట్ల సోలార్ పార్క్ (solar park)అభివృద్ధికి మంత్రిత్వ శాఖ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) ఆమోదం తెలిపిందని తెలిపారు. మొత్తం సామర్థ్యంలో, 250 మెగావాట్ల యూనిట్ ఫిబ్రవరి 8, 2020న ప్రారంభించబడింది. మిగిలిన 750 మెగావాట్ల యూనిట్లను SECI ద్వారా ఏర్పాటు చేయబోతున్నారు. 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ కోసం పెట్టుబడి రూ.3,000 కోట్లుగా అంచనా వేయబడింది. ఒక సంవత్సరం నిర్మాణ కాలంలో 25 సంవత్సరాల పాటు ఆపరేషన్, నిర్వహణ సమయంలో 1,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
అదేవిధంగా శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎన్‌పి కుంట, గాలివీడులో 1500 మెగావాట్ల సోలార్ పార్క్‌కు ఎంఎన్ఆర్ఇ(MNRE) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 1,400 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మిగిలిన 100 మెగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇది సంవత్సరానికి 200 MU సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయబడింది. దీంతో 1.6 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గుతాయని అంచనా వేశారు.