జాతీయ రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం భారీ కార్యాచరణ రూపొందిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఏడాదిన్నర కూడా సమయం లేకపోవడంతో తన ప్రణాళికల్లో వేగం పెంచుతున్నారు. ఖమ్మం సభ ఊహించని రీతిలో నిర్వహించి సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించారు. ఉద్దేశపూర్వకంగానే సరిహద్దు జిల్లా ఖమ్మంలో సభ నిర్వహించి ఏపీలో బీఆర్ఎస్ పై సరికొత్త చర్చకు తెరలేపారు. ఆ సభకు ఏపీలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఇక ఏపీలో అడుగు పెట్టేందుకు ఇదే సరైన సమయమని భావించారు. తదుపరి బీఆర్ఎస్ సభ ఏపీలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
అయితే కేసీఆర్ ఏపీలో ఎక్కడ సభ పెడతారనేది ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న మూడు రాజధానుల్లో రెండు కీలక నగరాలు విజయవాడ, విశాఖపట్టణం. కర్నూలు తర్వాత కానీ త్వరలోనే ఆ రెండు నగరాల్లోనే సభ ఉండేట్టు కనిపిస్తుంది. కేసీఆర్ ఇప్పటికే విజయవాడలో పలుమార్లు పర్యటించారు. అమరావతికి శంకుస్థాపన, ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ వచ్చారు. అయితే విశాఖకు మాత్రం కేసీఆర్ వెళ్లిన దాఖలాలు లేవు. పైగా జగన్ విశాఖ కేంద్రంగా పాలన సాగించేందుకు పట్టుదలగా ఉండడంతో కేసీఆర్ సభ కూడా అక్కడే పెట్టించాలని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భావిస్తున్నాడు. వైజాగ్ లో సముద్రపు ఒడ్డున రాజకీయ సెగ రగిల్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని చంద్రశేఖర్ ప్రకటించడం గమనార్హం.
తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ పలు పర్యాయాలు ఏపీలో పర్యటించారు. ఆ సమయంలో కేసీఆర్ పర్యటనకు ఏపీలో అనూహ్య స్పందన లభించింది. అమరావతికి శంకుస్థాపన, తిరుపతి పర్యటన, ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం తదితర కార్యక్రమాల కోసం కేసీఆర్ వచ్చారు. అప్పుడు రాజకీయ వివాదం లేదు. కానీ ఇప్పుడు రాజకీయ పర్యటన చేస్తుండడంతో ఏపీలో ఎలాంటి స్పందన ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ పేరును తీసి భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చిన కేసీఆర్ విభజన పార్టీ అనే ముద్రను చెరిపేశారు. ఆంధ్రలో ప్రవేశించేందుకు కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా విభజన పార్టీ, రాష్ట్రాన్ని కేసీఆరే రెండు ముక్కలు చేశాడు అనే పేరు ఎక్కడా వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏపీలో పర్యటించేందుకు ప్రత్యేకంగా ప్రచారం మొదలు పెట్టనున్నారని సమాచారం. ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లపై కేసీఆర్ చేసిన పలు సంచలన వ్యాఖ్యలు మరచిపోయేలా వాటిని మరిపించేలా ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.