Attack: హారన్ కొట్టినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై 14 మంది దాడి!
రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్‌ను తీయమంటూ హారన్ కొట్టినందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను కొందరు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన ఏపీ నెల్లూరు జిల్లాలోని కావలిలో జరిగింది. ఈ ఘటన పట్ల పలువురు అనేక విధాలుగా స్పందిస్తున్నారు.
Kavali: ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కొందరు దుండగులు దారుణంగా దాడి చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్‌ను తీయమని హారన్ కొట్టడం వల్లే దాడి చేశారని తెలుస్తోంది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడకు వెళుతోంది. కావలిలోని ట్రంకు రోడ్డులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన ముందున్న బైక్ అడ్డు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో వెంటనే ఆ ద్విచక్రవాహనదారుడు బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డాడు. అక్కడ ఉన్నవాళ్లు అతనికి సర్దిచెప్పి పంపించేశారు. అంతటితో గొడవ ముగిసిందని అనుకున్నారు. కానీ అసలు గొడవ ఇక్కడే మొదలయ్యింది.
ఆ వాహనదారుడు ఈ విషయాన్ని తన మిత్రులతో చెప్పాడు. తర్వాత 14 మంది స్నేహితులతో కలిసి ఆర్టీసీ బస్సు వెంబడి వెళ్లారు. పట్టణ శివార్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల దగ్గర బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్‌ను తిడుతూ.. అతనిపై దాడికి దిగారు. అతనిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనను బస్సులోని ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా.. అతనిపై దాడిచేసి మొబైల్‌ను పగలకొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. డ్రైవర్‌ను కావలి ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.