టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన పాదయాత్ర పై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చురకలు వేశారు. లోకేష్ పాదయాత్ర కాదు కదా పాక్కునే యాత్ర చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని అన్నారు. అసలు పాదయాత్ర కి ఒక అర్ధం ఉంది. మరి ఈ పాద యాత్ర చేయడానికి నారా లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని నిలదీశారు.. మంత్రి గుడివాడ అమర్నాథ్. పాదయాత్రలు వైఎస్ ఫ్యామిలీ పేటెంట్ హక్కు అని చెప్పారు.
అసలు నారా లోకేష్ పాదయాత్రకు అర్థమేముందని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. గతంలో జగన్ చేసిన పాదయాత్రకు ఓ అర్థం ఉందని, అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, ప్రజలతో మమేకమై కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ పాదయాత్రలు చేశారని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, మూడున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్తుంటే వారు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరం లోకేష్ కి ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు లేదని విమర్శించారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో బయలుదేరితే ప్రజలు తిప్పికొడతారని ఎద్దేవాచేశారు.