మరో నాలుగురోజుల్లో నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం కానుంది. పోలీసుల అనుమతి రాకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహించొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జీవో నంబర్ 1 అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ వైఖరిని విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రతిపక్షాల గొంతు అణచే చర్య ఇది అని మండిపడ్డాయి.
లోకేశ్ పాదయాత్రకు అనుమతి రాలేదు. ఇదే అంశంపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. అన్ని వివరాలు పరిశీలించి, నిబంధనల మేరకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఇవాళ లేదంటే, రేపు పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకోసం జిల్లా టీడీపీ నేతలు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. యాత్ర ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పర్మిషన్‌పై పోలీసులు తేల్చకపోవడంతో పరేషాన్లో ఉన్నారు.
పోలీసుల వైఖరిని టీడీపీ నేత బుద్దా వెంకన్న తప్పుపట్టారు. లోకేశ్ పాదయాత్రకు సీఎం జగన్ అనుమతి అవసరం లేదని మండిపడ్డారు. గతంలో జగన్ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎంత అసాధ్యమో, లోకేశ్ పాదయాత్రను అపడం కూడా అంతే అసాధ్యం అని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని ఇదే అంశంపై స్పందించారు. లోకేశ్ పాదయాత్రను ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పాదయాత్ర నిర్వహిస్తున్నామని పోలీసు శాఖకు సమాచారం ఇచ్చామని వారు అంటున్నారు. ఇక ఎవరి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.