దేశంలో రాజధాని (Capital) అంటూ లేని ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh). మా రాజధాని ఇది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మూడు రాజధానుల పేరిట అమరావతిని నిర్వీర్యం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిపాలన రాజధాని పేరిట విశాఖకు రాజధానిని మారుస్తుండడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ పర్యటన చేపడుతున్న సీఎం జగన్ కు ఊహించని షాక్ తగిలింది. విశాఖపట్టణంలోనే (Visakhapatnam) సీఎం జగన్ కు వినూత్న రీతిలో స్వాగతం పలుకుతూ బ్యానర్లు వెలిశాయి.
విశాఖపట్టణంలోని రుషికొండలో (Rushikonda) ‘రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం సుస్వాగతం’ అంటూ బ్యానర్లు వెలిశాయి. వైఎస్సార్ సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) ఇంటికి వెళ్లే దారిలో ఈ బ్యానర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. రాజధానిగా వద్దంటూ ఈ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ బ్యానర్లు జన జాగరణ సమితి పేరిట ఏర్పాటయ్యాయి. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు, అదానీ డేటా సెంటర్ (Adani Data Centre) శంకుస్థాపన కోసం బుధవారం సీఎం జగన్ విశాఖకు రానున్నారు. ఆయన పర్యటనకు ముందు ఈ బ్యానర్లు (Banners) వెలియడం సంచలనంగా మారింది.
ఈ బ్యానర్ల ఏర్పాటుపై జన జాగరణ సమితి (Jana Jagarana Samiti- JJS) కన్వీనర్ వాసు (Vasu) మాట్లాడారు. ‘అమరావతిలోని రైతు కుటుంబాలను రోడ్డున పడేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖలో సీఎం జగన్ కాపురం పెడుతున్నారు. జగన్ ను ప్రధాని మోదీ సన్మానించి క్యాపిటల్ లెస్ సీఎం (రాజధాని లేని సీఎం) అని బిరుదు ఇవ్వాలి. ఎన్నికలకు ఏడాది ముందు ఈ శంకుస్థాపనలు చేసి ఉత్తరాంధ్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు. రాజధాని పేరిట చేస్తున్న రాజకీయాన్ని వాసు తప్పుబట్టారు.