ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్ష తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఒక్కటయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఓటీటీ ఆహాలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావడం పొత్తుకు మరింత సానుకూలత ఏర్పడిందని చెప్పేందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహంతో పొత్తు ప్రయత్నాలపై మొదటికే మోసం తెచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అది కూడా విదేశాల్లో…
డల్లాస్ నగరంలో మెగా, నందమూరి అభిమానులు రచ్చకెక్కారు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. ఇరువర్గాలు విడిపోయి పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. జై బాలయ్య అని నందమూరి అభిమానులు అంటే, పోటీగా జై పవన్ అంటూ మెగా అభిమానులు నినదించారు. ఇదంతా జరిగింది కేవలం అక్కడ ప్లే చేసే పాటల గురించి అని తెలుస్తోంది. కార్యక్రమంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పాటలు పెట్టాలని ఓ వర్గం కోరగా, పవన్ పాటల కోసం మరొకరు పట్టుబట్టారు. ఇది చినికి చినికి వానలా మారింది.
ఈ ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్నారై సభ్యుడు కేసీ చేకూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట చేకూరి జై బాలయ్య అనడం, తమ అభిమాన నటుల పాటలు పెట్టాలని డిమాండ్ చేయడంతో, పవన్ ఫ్యాన్స్ తిరగబడ్డారు. చిరు, పవన్ పోస్టర్లను కొందరు చించివేశారు. చివరకు తగ్గిన బాలయ్య అభిమానులు పవన్ ఫ్యాన్స్‌తో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
2024 ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. 2019లో టీడీపీ, జనసేనలు వేర్వేరుగా పోటీ చేయడం వల్లే జగన్ అద్భుత విజయం సాధించారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ ప్రయత్నిస్తున్నారు. రెండుమూడు ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయి. కలిసి పోటీ చేస్తే సీట్ల షేర్ ఎలా, గెలిచాక ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాలపై ఇప్పటికే జోరుగా చర్చ సాగుతోంది.
అయితే ఇరువురు అధినేతలు పొత్తుకు సానుకూల సంకేతాలిచ్చిన సమయంలో డల్లాస్ వంటి పరిణామాలు ఆయా పార్టీలను ఇబ్బందికి గురి చేస్తాయంటున్నారు. ఇప్పటికే పొత్తు పెట్టుకోవద్దంటూ జనసేనకు అక్కడి అభిమాన సంఘాలు మొరపెట్టుకున్నాయట. అక్కడ సాధారణంగా పవన్ కంటే బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మొత్తానికి విదేశాల్లోని ఇరుపార్టీల అభిమానుల అత్యుత్సాహం చిక్కులు తెచ్చేలా ఉండవద్దని టీడీపీ, జనసేన కేడర్ కోరుకుంటోంది.