తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ కేడర్‌కు రిపోర్ట్ చేసిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చే అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేసిన సోమేష్ కుమార్‌కు ఏ శాఖను అప్పగించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందట. వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మరికొందరు సీనియర్ ఐఏఎస్‌ల బదిలీలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదితో పాటు సెలవుపై వెళ్లి తిరిగి రిపోర్ట్ చేసిన పాఠశాల విద్యాశాఖ మాజీ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌కు ఇతర శాఖలు అప్పగించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గోపాలకృష్ణ ద్వివేదికి వ్యవసాయ శాఖతో పాటు రాజశేఖర్‌కు పంచాయితీ రాజ్ శాఖలు అప్పగించవచ్చునని తెలుస్తోంది.