Telangana: ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ‘గ్యారెంటీ’ దరఖాస్తులకు రేషన్ కార్డు జత చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతిసారి సీజన్‌కు ముందుకు కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారి నుంచి ఆయా ఏఈవోలు దరఖాస్తులు స్వీకరించి వారి పేర్లను రైతుబంధు జాబితాలో చేర్చుతారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాకు కొత్త రైతుల ఎంపికను ప్రత్యేకంగా రేషన్‌కార్డుతో సంబంధం ఉన్నటువంటి గ్యారెంటీల దరఖాస్తులో చేర్చింది.
నిబంధనల ప్రకారం తెల్ల రేషన్‌కార్డు కావాలంటే తడి భూమి 3.5 ఎకరాల వరకు, మెట్ట భూమి 7.5 ఎకరాల వరకు ఉండాలి. అంటే తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి గరిష్ఠంగా 7.5 ఎకరాల వరకు భూమి ఉంటుంది. దీంతో రైతుభరోసాకు తెల్ల రేషన్‌కార్డును లింక్ చేస్తే 7.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు మాత్రమే అర్హులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెల్ల రేషన్‌కార్డు లేకపోతే రైతు భరోసా రాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే కాంగ్రెస్ పార్టీ నేతలు రైతుభరోసా పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద భూస్వాములకు, పాడుపడ్డ భూములకు రైతుబంధు ఇస్తున్నారని, దీన్ని కచ్చితంగా సవరిస్తామని తెలిపారు. అయితే ఈ సీజన్‌కు నిబంధనల్లో మార్పులు సమయం లేకపోవటంతో ఈసారికి పాత పద్ధతిలోనే రైతుబంధు పంపిణీ చేస్తున్నది. తర్వాత సీజన్ నాటికి భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కింద ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.7,500 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. అంటే ప్రస్తుతం ఏటా రూ.15 వేల కోట్లు అవసరం అవుతుండగా, ఇక నుంచి రూ.22,500 కోట్లు అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతుభరోసాకు పరిమితులు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Rice: రైస్‌పై కేంద్రం కీలక నిర్ణయం..సామాన్యులకు గుడ్ న్యూస్