»Warning To The People Of Telangana Be Careful For The Next Two Days
Telangana: తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. మరో రెండ్రోజులు జాగ్రత్త!
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం 8 గంటల వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి పంజా విసురుతోంది. రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత తీవ్రంగా ఉంటుందని, చలి భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పలు జాగ్రత్తలు తెలియజేశారు. శీతల గాలుల వల్ల గాలిలో తేమ శాతం పెరుగుతోందని, పలుచోట్ల పొగమంచు కురుస్తోందని స్పష్టం చేశారు.
తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకూ పట్టణాలతో పాటుగా గ్రామాల్లోనూ సాధ్యమైనంత వరకూ ఎవ్వరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. పొగమంచు వల్ల రహదారులను మంచు తెరలు కమ్మేస్తున్నాయని, వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో మరో రెండు రోజులు 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి -భువనగిరి, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత మరింత పెరుగుతుందని స్పష్టం చేసింది.