Yellow Alert: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజూ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్ ను దాటుతున్నాయి. దీంతో ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ తరుణంలోనే… నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాడ్పుల ముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది . నేటి నుంచి కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర పెరగనున్నాయి. ఎండల తీవ్రత ఉన్న తరుణంలో ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించింది.
ఇది ఇలా ఉంటే హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఈ నెల 6, 7 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని ఖమ్మం, ఆదిలాబాద్, నాగర్కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అందరు సరక్షితంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.