»Uttam Kumar Reddy Kcr Was In Depression And Frustration And Told Blatant Lies
Uttam Kumar Reddy: డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్లో ఉండి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్నారు.
Uttam Kumar Reddy: జిల్లాల పర్యటనలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్లో ఉండి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. పార్టీ ఇక ఉండదనే భయం కేసీఆర్‌లో మొదలైంది. జాతీయ పార్టీ అన్నారు. కానీ ఇంత త్వరగా కుప్పకూలిపోతుందని అనుకోలేదన్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ ఉండదు. ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారని ఉత్తమ్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంట బీమాను రద్దు చేశారు. కేసీఆర్ హయాంలో నష్టం జరిగితే రైతులకు బీమా పరిహారం ఇవ్వలేదన్నారు. అసలు నీటి పారుదల రంగం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు ఉందా? ప్రజల గురించి ఆలోచించకుండా కమిషన్ల కోసం ప్లాన్, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారని ఉత్తమ్ అన్నారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని ఉత్తమ్ అన్నారు.