‘Pushpa 2’లో మార్పులు.. కేశవ కోసం రంగంలోకి దిగిన మేకర్స్?
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 పై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్గా జరిగినా కొన్ని అనుకొని సంఘటనల వల్ల మార్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
Pushpa 2: ఊహించని విధంగా పుష్ప (Pushpa) పార్ట్ వన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్, సుకుమార్. పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో పుష్ప2 (Pushpa 2) సినిమాను నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టుతో మేకర్స్‌తో పాటు సినీ వర్గాలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళా జూనియర్ ఆర్టిస్ట్ కేసులో అతనిపై కేసు నమోదు చేశారు. 14 రోజులపాటు కోర్టు రిమాండ్ కూడా విధించారు. దీంతో పుష్ప2 షూటింగ్‌కు కాస్త ఇబ్బందిగా మారింది.
సీక్వెల్లో కేశవది కీలక పాత్ర. దీంతో అతడికి బెయిల్ ఇప్పించేందుకు మూవీ మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రిమాండ్ పూర్తయిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్.. కేశవ లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట. ఇదిలా ఉంటే.. మరోవైపు పుష్ప2 స్క్రిప్టులో సుకుమార్ కొన్ని మార్పులు చేస్తున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది యానిమల్ సినిమా. చిత్రంపై విమర్శలు భారీగా వస్తున్నాయి. వైలెన్స్ మరీ తీవ్రంగా ఉందని.. యానిమల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. పుష్ప2లో సుకుమార్ చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హింసను కాస్త తగ్గించాలని భావిస్తున్నాడట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. సుకుమార్ మాత్రం పుష్ప2ని ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.