లక్ష్మి పార్వతి మరోసారి తెలుగుదేశం నేతలపై మండిపడ్డారు. వార్డు మెంబర్ గా గెలవలేని వ్యక్తి ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని విమర్శించారు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అన్నారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రతిపక్షం తెర తీసిందన్నారు. రూ.100 చీర, పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తామని పిలిచి అమాయకుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. టీడీపీకి అంబేద్కర్ రాసింది కాకుండా ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని నిలదీశారు.
తను చేసిన ఏ తప్పులపై చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కనిపించదని వ్యాఖ్యానించారు. అన్ స్థాపబుల్ లో హంతకులు ఇద్దరు ఒకరిని ఒకరు సమర్ధించుకున్నట్టు ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి రాజధానిని తీసుకువచ్చారని ఆరోపించారు. దీనికి అత్మ గౌరవం అనే పేరు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాలని నిలదీయాలని, కానీ ఇవి ప్రజా కంటకంగా మారాయన్నారు.
కమ్యూనిస్ట్ నాయకులు తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు మనసు, శరీరం కుళ్ళి పోయాయాయని, ఎన్టీఅర్ కు చేసిన మోసం, అన్యాయాలకు క్షోభించి క్షీణించిపోయే రోజులు చంద్రబాబుకు మరెంతో దూరంలో లేవన్నారు. సహవాస దోషంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో పయనిస్తున్నారని, చంద్రబాబుతో కలిసి వెళ్తే జనసేననికే నష్టం అని పేర్కొన్నారు.