తాను గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని అనుకుంటున్నట్లు స్వయంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ప్రకటించారు. సోమవారం రాజ్ భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆయన తెలిపారు. 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అనేక రాజకీయ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మేలు చేసే విధంగా ప్రవర్తించారని, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి.బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్లో కోశ్యారి సీనియర్ నేత. ఆయన హయాంలో అనేక కాంట్రవర్సీలు జరిగాయి. కొన్నింటికి ఆయనే కేంద్ర బిందువుగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈయన పదవీ కాలంలో అతిపెద్ద వివాదం.