సంచలనాలకు మారుపేరుగా నిలిచే ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఏ శాఖలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. అందుకే ఆయనపై ప్రజలు పూలవర్షం కురిపిస్తారు. తనదైన చర్యలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజా రవాణా సంస్థను ప్రగతి పట్టాలెక్కిస్తున్నారు సజ్జనార్. ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన అనంతరం ఆర్టీసీ రూపురేఖలు మారాయి. అటు పాలనపరంగా.. ఇటు ప్రయాణికుల పరంగా ఆర్టీసీని మరింత చేరువ చేస్తున్నారు. అయితే టీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితులైన అనంతరం సామాజిక మాధ్యమాల సహాయంతో ఆర్టీసీ సేవలను ప్రజలకు అందుబాటులో తెచ్చారు. @tsrtcmdoffice అని ఆర్టీసీ ఎండీ అధికారిక ట్విటర్ ఖాతా ఉంది. ఈ ఖాతాను సోమవారం కొందరు హ్యాక్ చేశారు.
ఆర్టీసీ ఎండీ ట్విటర్ ఖాతా హ్యాక్ కు గురయినట్లు తెలంగాణ ఆర్టీసీ పీఆర్వో ప్రకటించారు. సోమవారం 3.30 గంటల సమయంలో హ్యాకింగ్ కు గురైందని తెలిపారు. ప్రస్తుతం ఆ అకౌంట్ నుంచి ఎటువంటి ట్వీట్లను చేయడం లేదని స్పష్టం చేశారు. రిప్లయ్ లు, లైక్ లు చేయడం లేదని వివరించారు. ప్రజలు ఎవరూ ఆ ట్విటర్ ఖాతాను ప్రస్తుతం నమ్మవద్దని సూచించారు. తదుపరి ప్రకటన వచ్చేవరకు ట్విటర్ ను ఫాలో చేయొద్దని తెలిపారు. ట్విటర్ ఖాతాను పునరుద్ధరించే పనిలో ఉన్నామని, దీనికి ట్విటర్ సహాయం తీసుకుంటున్నట్లు వివరించారు. అయితే అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సజ్జనార్ ఖాతా హ్యాక్ గురవడం విస్మయం కలిగించిందని ఆర్టీసీ విచారం వ్యక్తం చేసింది. సంచలనాల కోసమే హ్యాకింగ్ కు పాల్పడినట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఖాతాను పునరుద్ధరించనున్నారు. అయితే హ్యాకింగ్ కు పాల్పడిన వారు క్రిప్టో కరెన్సీకి చెందినవారుగా తెలుస్తున్నది. ట్విటర్ హ్యాకయిన అనంతరం క్రిప్టో కరెన్సీ గురించి ట్వీట్ చేశారు.